Jani Master: అతడి ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేస్తా - జానీ మాస్టర్
Jani Master: ప్యాన్ ఇండియా స్థాయిలో కొరియెగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సతీష్ అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వడం కోసం జానీ మాస్టర్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
Jani Master Press Meet: గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్లకు కూడా గుర్తింపు లభిస్తోంది. అలా తన డ్యాన్స్‌తో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు జానీ మాస్టర్. తాజాగా సతీష్ అనే మరో డ్యాన్స్ మాస్టర్.. జానీ మాస్టర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వడం కోసం జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడు అయినా జానీ మాస్టర్‌తో పాటు తన భార్య అయేషా, మరికొందరు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆమె చెప్పినవన్నీ నిజాలు..
ముందుగా TFTDDA అధ్యక్షుడిగా తన అసోసియేషన్ కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. ‘‘మా అసోసియేషన్ కోసం అయిదు కోట్ల విలువ చేసే ల్యాండ్ తీసుకున్నాం. అది ఇప్పుడు సమస్యల్లో ఉంది. అదే కాకుండా మరెన్నో సమస్యలు తీరుస్తానని నన్ను నమ్మి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను ఈ పదవిలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఈ ఆరు నెలల్లో రామ్ చరణ్, ఉపాసనతో సభ్యుల హెల్త్ ఇన్సురెన్స్ గురించి మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించాం’’ అని పేర్కొన్నాడు. ఇక సతీష్ విషయానికొస్తే.. తన భార్య అయేషా చెప్పిన నిజాల ఆధారంగా తనపై చర్యలు తీసుకున్నామని తెలిపాడు.
తెలంగాణకు ఇబ్బంది రాకూడదు..
‘‘సతీష్ చేసిన తప్పుకు లక్ష రూపాయల ఫైన్ విధించాం. కావాలనే ఒకరి పొట్ట కొట్టాలని నేనెప్పుడూ అనుకోను. తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి లెటర్ రాస్తే తనపై చర్యలు తీసుకునేవాళ్లం కాదు. కానీ అతను అలా చేయకుండా నేనేంటో చూపిస్తా అంటూ కొందరిని బెదిరించాడు. మరోవైపు పాటలు కొరియోగ్రాఫ్ చేస్తూనే ఉన్నాడు. దాంతో పాటు నామీద కూడా ఆరోపణలు చేశాడు. సతీష్ విడుదల చేసిన వీడియోలో ఒక్కటి నిజమున్నా నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను. నేను ఒకచోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నా వల్ల మా అధినేతకు, తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను’’ అని క్లారిటీ ఇచ్చాడు జానీ మాస్టర్.
డబ్బులు ఇస్తామంటున్నారు..
ఇక జానీ మాస్టర్ భార్య అయేషా మాట్లాడుతూ.. ‘‘అసోసియేషన్‌కు సంబంధించిన విషయాలను నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాతే దాని గురించి సభ్యులకు బయట మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సతీష్.. వాటిని లీక్ చేశాడు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందించడంతో తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. అందుకే కమిటీ మీటింగ్ పెట్టారు. తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా ఫైన్ కట్టనని సతీష్ అన్నాడు. గతంలో జానీ మాస్టర్ ఏ తప్పు చేయకపోయినా రూ.1 లక్ష ఫైన్ కట్టారు, వేరేవాళ్ల సమస్య గురించి మాట్లాడి 14 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద సతీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని, డబ్బులు ఇస్తామని సతీష్ దంపతులు కొందరికి ఫోనులు చేస్తున్నారు'' అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది అయేషా.
Also Read: మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా? నేను మిమ్మల్ని నాశనం చేయగలను - రేణు దేశాయ్ వార్నింగ్