Tollywood: 2023 ఫస్టాప్‌లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన భారీ బడ్జెట్ సినిమాలివే!
2023లో భారీ అంచనాలతో వచ్చిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్మాతలకు నష్టాలను మిగిల్చిన ఆ చిత్రాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.
2023 ఫస్టాప్ లో టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు విజయం సాధించాయో, అంతకుమించి పరాజయాలు నమోదయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అంచనాలను అందుకోవడంలో విఫలమై నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డిజాస్టర్లుగా మారిన తెలుగు సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
రావణాసుర:
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాదిలో 'రావణాసుర' చిత్రంతో భారీ ఫ్లాప్ అందుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ. 22 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. 'ధమాకా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజకు, ఈ సినిమాతో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
శాకుంతలం:
2023 అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల్లో 'శాకుంతలం' ముందు వరుసలో ఉంటుంది. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈ పౌరాణిక చిత్రం తెరకెక్కింది. కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా 3డీ టెక్నాలజీలో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. పేలవమైన వీఎఫ్ఎక్స్ తో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు 65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వరకే వసూలు చేయగలిగింది. దిల్ రాజు తన 20 ఏళ్ళ కెరీర్ లో అతి పెద్ద జర్క్ అని అన్నాడంటే, ఆయనకు ఏ రేంజ్ లో నష్టం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఏజెంట్:
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే బాక్సాఫీస్ వద్ద వాష్ ఔట్ అయింది. ఈ సినిమా కారణంగా నిర్మాతకు దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ టాక్.
కస్టడీ:
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ బైలింగ్వల్ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇది చైతూకి కోలీవుడ్ డెబ్యూ.. డైరెక్టర్ కు టాలీవుడ్ డెబ్యూ. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, కృతి శెట్టి, ప్రియమణి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా, ఫలితం లేకపోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి.
రామబాణం:
'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'రామబాణం'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం మే 5న రిలీజ్ అయింది. గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 2023లో నిర్మాతలకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా మిగిలింది.
ఆదిపురుష్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ రెండు వారాల్లో ₹ 407.24 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కాకపొతే సినిమాకి ఖర్చు చేసిన బడ్జెట్ ప్రకారం చూస్తే, ప్రొడ్యూసర్స్ కు నష్టాలు తప్పేలా లేవని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇకపోతే 2023 ప్రథమార్థంలో భారీ బడ్జెట్ సినిమాలలో పాటుగా క్రేజీ ప్రాజెక్ట్స్ గా భావించిన మరికొన్ని చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్,' సందీప్ కిషన్ 'మైఖేల్,' సుధీర్ బాబు 'హంట్', కిరణ్ అబ్బవరం 'మీటర్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన నిఖిల్ సిద్దార్థ్ 'స్పై' మూవీ కూడా ఆశించిన మేర ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. మరి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి.
Also Read: 2023 ఫస్టాప్ బాక్సాఫీస్ రిపోర్ట్: అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు ఇవే!