Huma Qureshi: పార్కింగ్ వివాదం - బాలీవుడ్ హీరోయిన్ సోదరుడి మర్డర్
Huma Qureshi Cousin: బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ఢిల్లీలో దారుణంగా చంపేశారు. చిన్న పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తి అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.

Bollywood Actress Huma Qureshi Cousin Brother Murdered In Delhi: బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ బంధువు ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. వరుసకు ఆమెకు సోదరుడయ్యే ఆసిఫ్ ఖురేషీని పార్కింగ్ వివాదంతో కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయగా ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రాత్రి 11 గంటల టైంలో జంగ్పురా భోగల్ లేన్‌లో ఓ వ్యక్తి తన స్కూటీని పార్క్ చేశారు. హీరోయిన్ హ్యూమా ఖురేషీ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ అక్కడి నుంచి బండి తీయాలని కోరారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఖురేషీతో వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో ఆసిఫ్‌పై వారు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా... స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆసిఫ్ మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్ధారించారు.
ఇద్దరి అరెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పార్కింగ్ విషయంలోనే వారిద్దరూ తనతో గొడవ పడినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. 'గురువారం రాత్రి నా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. ఆ టైంలో ఇంటి మెయిన్ గేట్ వద్ద ఉన్న స్కూటీని తీయాలని కోరారు. దీంతో వారు ఆయనతో గొడవకు దిగారు. పదునైన ఆయుధాలతో దాడి చేశారు.' అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న పార్కింగ్ విషయంలోనే తన భర్తను దారుణంగా చంపేశారంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు.
హీరోయిన్ హ్యూమా ఖురేషీ అటు హీరోయిన్, ఇటు రచయితగానూ పాపులర్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' సినిమాలో జరీనా పాత్రలో ఆమె కనిపించారు. అలాగే... డబుల్ ఎక్స్ఎల్, గంగూబాయి కఠియావాడీ, బద్లాపూర్, వలిమై, జాలీ ఎల్ఎల్‌బీ 2 తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు 'మహారాణి' వెబ్ సిరీస్‌లో నటించారు.





















