Adivi Sesh’s Major Movie-మృత్యువుకు ఎదురెళ్లిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్
దేశం మరిచిపోలేని సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన ధైర్య సాహసాల గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నారు.
మేజర్‌కి దేశం సెల్యూట్ చేస్తోంది..
ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న మూవీ మేజర్. అడవి శేష్ లీడ్‌రోల్‌లో నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రివ్యూ షోలు చూసిన వాళ్లంతా అద్భుతమైన సినిమా అని పొగుడుతున్నారు. ఇంకొందరు ఎమోషనల్ అవుతున్నారు. సందీప్ ఉన్నికృష్ణన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులకు ఎదురెళ్లి పోరాటం చేసిన ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాతో మరోసారి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరు దేశమంతా మారుమోగుతోంది.
2008 నవంబర్26న ఏం జరిగింది..?
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రవాదులు దాడి చేయటాన్ని చూసి యావత్ దేశం ఉలిక్కిపడింది. పాకిస్థాన్ నుంచి లష్కరే తోయిబా సంస్థకు చెందిన ముష్కరులు సముద్ర మార్గంలో ముంబయికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. తాజ్ హోటల్‌లోకి చొరబడి దాదాపు 60 గంటల పాటు మారణహోమం కొనసాగించారు ఉగ్రవాదులు. ఈ క్రమంలోనే 160మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు.సైనికులూ ప్రాణాలర్పించారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించే. 31 ఏళ్ల మేజర్ సందీప్ ఉగ్రవాదులకు ఎదురెళ్లిన తీరుని గురించి ఇప్పటికీ సీనియర్ కమాండోలు గర్వంగా చెబుతుంటారు. గదిలో చిక్కుకున్న ఓ మహిళా ఉద్యోగిని సురక్షితంగా తీసుకురావాలని అనుకున్నారు మేజర్ సందీప్. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ కూడా వేసుకున్నారు. మేజర్‌తో పాటు మరో ఆరుగురు కమాండోలో ప్యాలెస్‌లోకి వెళ్లారు. అనూహ్యంగా ఉగ్రవాదులు దాడి చేయటం వల్ల మిగతా కమాండోలను కాపాడేందుకు మేజర్ సందీప్ ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఓ బుల్లెట్ సందీప్ శరీరంలో నుంచి దూసుకెళ్లి అమరులయ్యారు. "మీరెవరూ పైకి రావద్దు, అంతా నేను చూసుకుంటాను". చివరిసారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మాట్లాడిన మాటలివే. ఆఖరి క్షణం వరకూ తోటి కమాండోలను కాపాడేందుకే తీవ్రంగా ప్రయత్నించారు మేజర్ ఉన్నికృష్ణన్. ఈ ధైర్యసాహసాలను మెచ్చింది యావత్ భారతం. ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించింది. ఈ దుర్ఘటన జరిగి 14 ఏళ్లు దాటినా ఇప్పటికీ అప్పటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధ పడుతుంటారు ముంబయి వాసులు.
ఎవరీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్..?
మేజర్ ఉన్ని కృష్ణన్ 1977లో కేరళలోని కోజికోడ్‌లో జన్మించారు. వీరి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. చిన్న నాటి నుంచే ఆర్మీలో చేరాలని కలలు కనేవారు ఉన్నికృష్ణన్. మేజర్ తండ్రి ఇస్రోలో పని చేసేవారు. 1995లో మహారాష్ట్రలోని పుణెలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు సందీప్. ఆస్కార్ స్వాడ్రన్‌లో సేవలందించిన ఉన్ని కృష్ణన్, బిహార్ రెజువెంట్ లోని 7వ బెటాలియన్ లో లెఫ్టినెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. 2006లో ఎన్‌ఎస్‌జీ కమాండో సర్వీసెస్‌లో చేరారు. మేజర్ సందీప్ చాలా చురుకైన వ్యక్తి అని తోటి అధికారులు ఇప్పటికీ చెప్పుకుంటారు.