Telangana Elections News: మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో నేతల జులుం! జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన బీజేపీ
Telangana Election Campaign News: షామీర్ పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి చేశారు. ఈ దాడిపై సదరు జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
Medchal Politics News: మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ప్రచారంలో బీఆర్ఎస్ నాయకుల జులుం ప్రదర్శించారు. గౌడవెళ్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం చూపారు. డబ్బులు పంచుతున్నారని వీడియో కవరేజ్ చేస్తున్న రిపోర్టర్లపై దాడి చేశారు. ప్రచారానికి వచ్చిన వారికి డబ్బుల కోసం టోకెన్ ఇస్తుండగా వీడియో తీస్తున్న మేడ్చల్ కు చెందిన ఓ జర్నలిస్టు విశ్వపై సత్తి రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడు. జర్నలిస్టును గోడకు అదిమిపెట్టి బెదిరింపులకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
శనివారం కూడా షామీర్ పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి చేశారు. ఈ దాడిపై సదరు జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాసేవ నిజాయతీగా చేస్తామని ఓటు అభ్యర్థించాల్సిన అధికార పార్టీ నాయకులు.. ఓటర్లను నోటుతో కొనుగోలు చేస్తున్న తీరును బయట పెడుతుంటే తమపై దాడి చేయడం పట్ల జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ లోని గౌడవెల్లి గ్రామంలో జర్నలిస్టు విశ్వపై బీఆర్ఎస్ నేతల దాడిని మేడ్చల్ మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు బచ్చు కృష్ణప్రియ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేసి బీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారి సామాన్యులపై, జర్నలిస్టులపై సైతం దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. నగదు పంపిణీకి బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇది గుర్తించిన ఓ జర్నలిస్టు ఈ విషయాన్ని కవర్ చేస్తుండగా, సత్తిరెడ్డి అనే బీఆర్ఎస్ నేత దాడికి పాల్పడ్డారు. ఓటమి భయంతో డబ్బులు పంచుతున్నారనా, లేక అధికారం కోల్పోతామని జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారా అని బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు.
Also Read: Telangana Elections 2023: 'బీఆర్ఎస్ పాలనలో అవస్థలు, అవమానాలు తెలుసు' - ప్రజా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
మంత్రి మల్లారెడ్డి అనుచరుల తీరు సరికాదని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎదుర్కోవాలన్నారు కృష్ణప్రియ. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతల్ని స్థానికులు, బీజేపీ నేతలు ప్రశ్నించగా.. అతడు జర్నలిస్టు అని తమకు తెలియదని చెప్పారన్నారు. సామాన్యులు అయితే వారిపై దాడి చేయడానికి బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా అంటూ నిలదీశారు. వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో బీఆర్ఎస్ నేత సత్తి రెడ్డి వెనక్కి తగ్గారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారికి స్థానం దక్కకూడదన్నారు.
మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రజలకు డబ్బులు పంపిణీ స్లిప్ లు పంచుతున్నారని కవరేజ్ చేసిన మీడియాపై బీఆర్ఎస్ నేత దాడిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఖండించారు. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్యులకు బీఆర్ఎస్ ఏం రక్షణ కల్పిస్తుంది, వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన శ్రేణులను నియంత్రించడంతో విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి దాడులు ఎవరు చేసిన వాటిని ఉపేక్షించకూడదన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply