TS ICET: టీఎస్ ఐసెట్-2024కు దరఖాస్తుల వెల్లువ, ఇప్పటికే 80 వేలు దాటిన దరఖాస్తులు
TS ICET-2024 దరఖాస్తు గడువు రూ.250 ఆలస్యరుసుముతో మే 17తో, రూ.500 ఆలస్య రుసుముతో మే 27తో ముగియనుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి.
TS ICET 2024 Appications: తెలంగాణలోని పీజీ కాలేజీల్లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘TS ICET-2024’కు దరఖాస్తు గడువు రూ.250 ఆలస్యరుసుముతో మే 17తో ముగియనుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే మే 17 నుంచి 20 మధ్య సవరించుకోవచ్చు. పరీక్ష హాల్‌టికెట్లను మే 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
ఐసెట్ పరీక్ష కోసం ఇప్పటివరకు 80,631 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు మరింత గడువు ఉండటంతో.. మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతేడాది ఐసెట్‌కు మొత్తంగా 75,520 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 80,631 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య దాదాపు 90 వేల వరకు చేరే అవకాశం ఉందని ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి మే 16న ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. టీఎస్ ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. జూన్ 5న రెండు సెషన్లలో (ఉ.10 గం. - మ.12.30 వరకు; మధ్యాహ్నం 2.30 గం. - సా.5 గం. వరకు), జూన్ 6న ఒకే సెషన్‌లో (ఉ.10 గం. - మ.12.30 వరకు) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, జూన్ 15న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూన్ 28న ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
వివరాలు..
టీఎస్ ఐసెట్ - 2024
కోర్సులు - అర్హతలు..
1) ఎంసీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
2) ఎంబీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: ఐసెట్-2024 నోటిఫికేషన్ సమయానికి (05.03.2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.