(Source: ECI/ABP News/ABP Majha)
Bonalu Holiday: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, సోమవారం విద్యాసంస్థలకు సెలవు
Bonalu Festival Holiday in Telangana: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు విద్యాసంస్థలకు సెలవు. బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 17) సెలవు ప్రకటించింది.
Bonalu Festival Holiday in Telangana: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు విద్యాసంస్థలకు సెలవు. బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జులై 17) సెలవు ప్రకటించింది. ఇవాళ ఆదివారం, రేపు సెలవు కావడంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తున్నారు. తిరిగి మంగళవారం (జులై 18) స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.కాగా, హైదరాబాద్ పాతబస్తీ లో ఆది, సోమవారాల్లో బోనాల వేడుకలు సజావుగా నిర్వహించేందుకు సౌత్ జోన్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో వాహనాలురాకుండా.. ఇతర మార్గాలకు వాహనాలను మళ్లిస్తున్నారు. రెండు రోజులూ సౌత్ జోన్‌లోనే దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఆషాడ బోనాల సందడి జూలై 17 తో పూర్తవుతుంది. గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయం దగ్గర మొదలైన లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. బోనాలు వేడుకలకు అమ్మవారి ఆలయాలు మాత్రమే కాదు వీధుల్నీ కూడా వేపాకులతో అలంకరిస్తారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ జంటనగరాలతో పాటూ తెలంగాణ వ్యాప్తంగా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ బోనాలు జరుపుకుంటారు. చివరి వారం పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. చివరిగా ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతర ముగుస్తుంది.
బోనం ఎందుకంటే..?
రుతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభంకాగానే మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉన్నది. వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడుతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా.. బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు. భోజనం ప్రకృతి అయితే.. దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుచుకుంటారు.
ఫలహారం బండి
అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు. ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది. ‘భోజనం’ ప్రకృతి ‘బోనం’ వికృతి అని చెబుతారు. బోనం తలకెత్తుకున్న వారిని ‘అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు బోనమెత్తిన వారి పాదాలను కడుగుతారు. బోనాన్ని సమర్పించే పక్రియను ‘ఊరడి’ అంటారు. పల్లె ప్రాంతాలలో ‘పెద్దపండుగ, ఊరు పండుగ’ అని పిలుస్తారు. బోనం ఎత్తిన రోజు లేదా మర్నాడు భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారు చేసి బండిపై ఊరేగింపుగా తీసుకువెళతారు. దీనిని ‘ఫలహారం బండి’ అంటారు.
ఘటోత్సవం - తొట్టెల ఊరేగింపు
సమృద్ధిగా వానలు కురవాలని, ప్రకృతి పచ్చగా ఉండాలని, అంతా ఆరోగ్యంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ ‘సాకబెట్టు’ పేరుతో పసుపు, వేపాకు, పచ్చకర్పూర, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శక్తిమాతలను అభిషేకిస్తారు. ఒక కుండ (ఘటం)ను చక్కగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దానిపై ఉంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళతారు. ఘటోత్సవంతో పాటు పిల్లలు ఆరోగ్యంతో, పూర్ణాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఉయ్యాల తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. వీటిని పూలతో తయారుచేస్తారు. వెదురుబొంగులను రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. ఇవి మూడు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల వరకూ ఉంటాయి. పండుగ ముగిసిన రోజు డప్పు వాయిద్యాలు, పాటలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
ప్రకృతికి జరిగే పూజ..
ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించేందుకు మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ఏటా ఆషాడ మాస తొలి ఆదివారం బోనాల జాతర మొదలై ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. ఆషాడంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చిన భావించి పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ… ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.