World Bank: శకునాలు బాగా లేవు, 2023లో మాంద్యం తప్పదు!, మీ పెట్టుబడులు జాగ్రత్త
2023లో ప్రపంచ వృద్ధి రేటును అంతకు ముందున్న అంచనా 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది.
World Bank: 2023లో, ఆర్థిక మాంద్యం (Recession) ప్రభావం తప్పదన్న సంకేతాలను ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యానికి అతి సమీపంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెళ్తుందని ప్రపంచ బ్యాంకు (World Bank) హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి మూల స్తంభాల్లాంటి అమెరికా, యూరప్, చైనాలో కనిపిస్తున్న మందగమనమే ఇందుకు కారణంగా వెల్లడించింది.
తన వార్షిక నివేదికలో అనేక విషయాలు వెల్లడించిన ప్రపంచ బ్యాంక్, 2023లో ప్రపంచ వృద్ధి రేటును అంతకు ముందున్న అంచనా 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. ప్రపంచ బ్యాంకుమంగళవారం ఈ నివేదికను విడుదల చేసింది.
అత్యంత చెత్త స్థితికి ప్రపంచం
ప్రపంచ బ్యాంకు అంచనాలు నిజమైతే, గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధి అత్యంత బలహీన స్థాయికి చేరడం ఇది మూడోసారి అవుతుంది. అంతకుముందు... 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా, 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వృద్ధి రేటులో భారీ క్షీణత కనిపించింది. వీటిలోనూ, ఈ ఏడాది వచ్చే క్షీణత అతి ఎక్కువగా ఉంటుందని నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం... అమెరికా ఈ సంవత్సరం మాంద్యం నుండి తప్పించుకోగలదు. కానీ ఆ దేశ వృద్ధి రేటు 0.5 శాతానికి మాత్రమే పరిమితం అవుతుంది.
కరోనా మహమ్మారి & ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాలోని సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడవచ్చని నివేదిక పేర్కొంది. అధిక ధరల రూపంలో అమెరికా ప్రజలకు, అధిక వడ్డీ రేట్ల రూపంలో ఆ దేశంలోని వ్యాపారాలకు సవాళ్లు ఎదురు కావచ్చు. దీంతో పాటు, ప్రపంచ స్థాయి బలహీనతలు కూడా గుదిబండలుగా మారవచ్చు.
మరోవైపు... ఐరోపాకు ప్రధాన ఎగుమదిదారు చైనా. చైనా ఆర్థిక వ్యవస్థ ఏటికేడు బలహీనంగా మారుపడుతుండడం, ప్రధానంగా ఆ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు యూరోప్‌నకు పెద్ద దెబ్బ. కాబట్టి, చైనా ఆర్థిక వ్యవస్థలో బలహీనత భారాన్ని యూరప్ భరించవలసి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. కాబట్టి, ఐరోపా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందకపోవచ్చని అంచనా వేసింది. 2022లో ఇది 3.3% వృద్ధి చెందింది. చైనా, 4.3% వృద్ధితో ఆగిపోవచ్చని లెక్క కట్టింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలు 3.4% వృద్ధిని కొనసాగించొచ్చని, అయితే.. 2021తో పోలిస్తే ఇది సగమేనని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
అమెరికా, యూరప్‌లో పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా పేద దేశాల నుంచి పెట్టుబడులు అటు వైపు వెళ్లిపోతాయని, దీంతో పేద దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడుల సంక్షోభం ఏర్పడవచ్చని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. మరోవైపు... పెరిగిన ఆహార ధరలు, అధిక వడ్డీ రేట్ల వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి బలహీనంగా ఉంటుందని, ఆ దేశాలు కూడా బావుకునేదీ ఏమీ ఉండదని చెప్పింది.
IMF కూడా ఇదే చెప్పింది
అంతకుముందు, అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చింది. 2023-24లో ప్రపంచంలో మూడో వంతు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని రిపోర్ట్ చేసింది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంటుందని IMF అంచనా వేసింది. 2022-23లో ఇది 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ముడి చమురు ధరల పెరుగుదల, బలహీనమైన బాహ్య డిమాండ్, కఠినమైన ద్రవ్య విధానం కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు క్షీణించవచ్చని IMF పేర్కొంది.