UPI PayNow: ఇకపై సింగపూర్‌కు డబ్బులు పంపడం &స్వీకరించడం చిటికెలో పని, UPI-PayNow వచ్చేసింది
సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
UPI PayNow integration: భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో మైలురాయిని దాటింది. ఇప్పటికే దేశ సరిహద్దులు దాటిన UPI (Unified Payments Interface), ఇప్పుడు సింగపూర్‌ని కూడా చేరింది. భారత్-సింగపూర్ మధ్య డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు మరింత సులభంగా మారాయి. సింగపూర్‌లో పని చేస్తున్న భారతీయులు, ఇకపై నేరుగా భారత్‌లోని బంధుమిత్రులకు డబ్బులు పంపవచ్చు.
ఇరు ప్రధానుల సమక్షంలో UPI-PayNow ఒప్పందం
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి, భారత్- సింగపూర్ మధ్య కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశ UPIని, సింగపూర్ 'పేనౌ'ని (PayNow) ఈ ఒప్పందం ద్వారా కనెక్ట్ చేశారు. ఇవాళ (మంగళవారం, 21 ఫిబ్రవరి 2023) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒప్పందంతో, రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ పేమెంట్ కనెక్టివిటీ ప్రారంభమైంది.
భారతదేశం తరపున ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), సింగపూర్ తరపున 'మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్' మేనేజింగ్ డైరెక్టర్ రవి మేనన్ కలిసి, భారత్ - సింగపూర్ మధ్య రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ (real-time retail payment system) లింకేజ్ ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలకు ఏంటి ప్రయోజనం?
ఈ ఒప్పందం ఫలితంగా, నేటి నుంచి, UPI PayNowను ఉపయోగించి భారత్‌లో ఉన్నవాళ్లు సింగపూర్‌లో ఉన్నవాళ్లకు, సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు పంపడానికి దీని ద్వారా అవకాశం వచ్చింది.
ముఖ్యంగా, భారత్ నుంచి సింగపూర్ వెళ్లి వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేస్తున్న వాళ్లకు, విద్యార్థులకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. డబ్బులు పంపాలన్నా, స్వీకరించాలన్నా ఇకపై ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. భారత్‌లో UPI ద్వారా ఎలా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపడం & స్వీకరించడం చేస్తున్నామో, అదే విధంగా UPI PayNowని ఉపయోగించుకోవచ్చు. అంటే... సింగపూర్‌కు డబ్బులు పంపడం, అక్కడి నుంచి స్వీకరించడం ఇకపై చిటికెలో పని.
ఈ సందర్భం ఇరు దేశాలకు ఎంతో అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని అన్నారు. యూపీఐ-పే నౌ లింక్‌ను ప్రారంభించడం ఇరు దేశాల పౌరులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బహుమతిగా ప్రధాని అభివర్ణించారు. భారత్, సింగపూర్‌లోని ప్రజలు తమ తమ దేశాల్లో మొబైల్ ఫోన్ల నుంచి నగదును బదిలీ చేసుకున్నట్లుగానే, నేటి నుంచి ఈ రెండు దేశాల మధ్య కూడా పంపుకోవచ్చని చెప్పారు.
RBI రెమిటెన్స్ సర్వే - 2021 ప్రకారం... 2020-21లో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మొత్తం నగదులో సింగపూర్‌ది వాటా 5.7 శాతం.