(Source: ECI/ABP News/ABP Majha)
Muhurat Trading Profits: కొత్త సంవత్ ప్రారంభం - దీపావళి 'ముహూరత్ ట్రేడింగ్'తో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Muhurat Trading Profits: దీపావళి సందర్భంగా నిర్వహించే 'ముహూరత్ ట్రేడింగ్'తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ సాయంత్రం 6:15 గంటలకు మొదలైన ట్రేడింగ్ 7:15 వరకూ సాగింది.
Muhurat Trading: దీపావళి సందర్భంగా నిర్వహించిన ‘ముహూరత్ ట్రేడింగ్’తో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మూరత్ ట్రేడింగ్ ను ఈ ఏడాది ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ష్రూడర్, ఐఐఎం జమ్మూ ఛైర్మన్, పద్మశ్రీ మిలింద్ కాంబ్లే తదితరులు ఎన్‌ఎస్‌ఈ బెల్ మోగించి ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు మొదలైన ఈ ట్రేడింగ్ 7.15 గంటలకు ముగిసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ (BSE) సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి 65,259 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 100 పాయింట్లు ఎగబాకి 19,525 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.30గా ఉంది. మూరత్ ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి.
ముహూరత్ ట్రేడింగ్ అంటే?
స్టాక్ మార్కెట్లకు దీపావళి చాలా ప్రత్యేకం. పండుగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంట సేపు ట్రేడింగ్ జరుపుతారు. దానినే 'ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు. పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు. ఈ సంప్రదాయం భారతదేశంలో చాలా కాలంగా కొనసాగుతోంది. బీఎస్ఈ 1957లో తొలిసారిగా ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభించింది. దీని తర్వాత, 1992లో, ఎన్ఎస్ఈ ప్రతి ముహూరత్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ రోజు ఓ గంట సెషన్ లో ట్రేడింగ్ చేస్తే ఏడాదంతా పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతారని విశ్వసిస్తారు. ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లు, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ వంటి విభాగాల్లో ట్రేడింగ్ జరుగుతుంది. దన త్రయోదశి నాడు కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా ఎలా కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారో, 'ముహూరత్ ట్రేడింగ్' సమయంలోనూ కనీసం ఒక్క స్టాక్ అయినా కొనాలని చాలా మంది ట్రేడర్లు సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ క్రమంలో దీపావళి రోజున స్టాక్ మార్కెట్లనీ కళకళలాడుతుంటాయి.
2080 సంవత్ ప్రారంభం
దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2079 సంవత్ ట్రేడింగ్ శుక్రవారంతో పూర్తైంది. ఆదివారం 2080 సంవత్ ప్రారంభం అయింది. స్టాక్ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే.. మళ్లీ వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని మదుపర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రతి ఏడాది దీపావళి రోజు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. ఓ గంట ముహూరత్ ట్రేడింగ్ కు తోడు 15 నిమిషాలు ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుంది.