Amazon vs Future: 'ఫ్యూచర్ గ్రూప్'కు సుప్రీంలో భారీ ఊరట.. ఆస్తుల జప్తుపై స్టే
ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ ఆస్తుల అటాచ్ విషయంలో నాలుగు వారాల వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని సెబీ, సీసీఐకి సుప్రీం నోటీసులు పంపింది.
కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కంపెనీకి చెందిన ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రీటైల్, ప్రమోటర్ కిషోర్ బియానీకి చెందిన ఆస్తుల అటాచ్‌పై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఈరోజు నిలిపివేసింది. గతంలో ఆన్‌లైన్ రీటైలర్ అమెజాన్.. సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల అమలు కోరుతూ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కోర్టు ఆదేశాలు, ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది.
నాలుగు వారాలు స్టే..
అంతేకాకుండా నాలుగు వారాల వరకు ఎలాంటి తుది ఉత్తర్వులు జారీ చేయొద్దని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెబీకి నోటీసులు జారీ చేసింది. అయితే అమెజాన్‌తో తలెత్తిన రూ.24,713 కోట్ల ఈ కొనుగోలు ఒప్పందం వివాదంలో ఫ్యూచర్‌కు వ్యతిరేకంగా సుప్రీం ఇదివరకే తీర్పు ఇచ్చింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు భారత్‌లోనూ చెల్లుబాటవుతుందని పేర్కొంది.
ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తూ కుదుర్చుకొన్న డీల్‌పై అమెజాన్‌తో వివాదం చెలరేగింది. తాజాగా ఈ డీల్‌కు చెందిన సంబంధిత విభాగాలైన ఎన్‌సీఎల్‌టీ, సీసీఐ,సెబీలు.. డీల్‌కు అంగీకారం తెలిపే తుది ఆదేశాలను జారీ చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ దాఖలు చేసిన అప్పీల్‌ను నాలుగు వారాల తర్వాత విచారణకు స్వీకరిస్తామని చెప్పింది.
Also Read: EC Announces By-Elections: ఆరు రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 4న ఉపఎన్నికలు
ఇదీ వివాదం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఇటీవల డీల్ కుదిరింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ అమెజాన్ సంస్థ సింగపూర్‌లోని మధ్యవర్తిత్వ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌లో తమకు వాటాలు ఉన్నాయి కనుక ఫ్యూచర్ రీటైల్‌లో తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని అమెజాన్ వాదించింది. దీనిపై విచారణ జరిపిన సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఈ ఒప్పందంపై కోర్టు స్టే విధించింది. అయితే విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు ఇండియాలో చెల్లవంటూ ఫ్యూచర్ గ్రూప్ వాదించింది. దీంతో సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు అమలు చేయాలంటూ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సింగపూర్ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు భారత్ లో చెల్లుబాటు అవుతుందని సుప్రీం ఫ్యూచర్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
Also Read: Ram Charan Watch: రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ దొరికితే కోటీశ్వరులు కావచ్చు.. ధర ఎంతో తెలుసా?