Best Selling Cars: ఫిబ్రవరిలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే - ఏడు కార్లు ఒక బ్రాండ్‌వే!
2023 ఫిబ్రవరిలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.
Best Selling Cars in India: 2023 ఫిబ్రవరికి సంబంధించి కార్ల అమ్మకాల వివరాలను అన్ని ప్రముఖ కంపెనీలు విడుదల చేశాయి. ఈ కాల వ్యవధిలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లలో ఏడు మోడల్స్ మారుతి సుజుకికి సంబంధించినవే ఉన్నాయి. బలెనో, స్విఫ్ట్, ఆల్టో, వాగన్ఆర్, డిజైర్, ఈకో, బ్రెజా మోడల్స్ ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుండాయ్ క్రెటా మిగతా మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఎస్‌యూవీ సేల్స్ పెరుగుతున్నాయ్
ఈ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో నాలుగు ఎస్‌యూవీ మోడల్స్ ఉన్నాయి. దీంతో పాసింజర్ వెహికిల్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ షేర్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఎస్‌యూవీ వాహనాల షేర్ 42 శాతంగా ఉంది.
హాట్‌గా హ్యాచ్‌బ్యాక్ సేల్స్
ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా మారుతి సుజుకి బలెనో నిలిచింది. ఇది మొత్తంగా 18,592 యూనిట్లు అమ్ముడు పోయింది. దీని తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ 18,412 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో కూడా మారుతి సుజుకి కారే ఉంది. అది మారుతి సుజుకి ఆల్టో. దీనికి సంబంధించి 18,114 యూనిట్లు అమ్ముడుపోయాయి.
మారుతి సుజుకి వాగన్ఆర్ 16,889 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానాన్ని మాత్రం సెడాన్ కారు దక్కించుకుంది. 16,798 యూనిట్లతో మారుతి సుజుకి డిజైర్ ఐదో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే టాప్ 5లో ఉన్న ఐదు కార్లూ మారుతి సుజుకి మోడల్స్‌వే అని చెప్పవచ్చు. వీటిలో నాలుగు హ్యాచ్ బ్యాక్‌లు కాగా, ఒకటి సెడాన్ కారు.
ఎస్‌యూవీ కార్లు ఏవి ఎక్కువ అమ్ముడుపోయాయి?
ఇక ఎస్‌యూవీ అయిన మారుతి సుజుకి బ్రెజా 15,787 యూనిట్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. 13,914 యూనిట్లతో టాటా నెక్సాన్ ఏడో స్థానంలో ఉంది. 11,352 యూనిట్లతో మారుతి సుజుకి ఈకో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ఒక వ్యాన్. 11,169 యూనిట్లతో టాటా పంచ్ తొమ్మిదో స్థానం లోనూ, 10,421 యూనిట్లతో హ్యుండాయ్ క్రెటా పదో స్థానం లోనూ నిలిచాయి.
టాప్ 10 కార్ల పూర్తి లిస్ట్
1. మారుతి సుజుకి బలెనో - 18,592 యూనిట్లు
2. మారుతి సుజుకి స్విఫ్ట్ - 18,412 యూనిట్లు
3. మారుతి సుజుకి ఆల్టో - 18,114 యూనిట్లు
4. మారుతి సుజుకి వాగన్ఆర్ - 16,889 యూనిట్లు
5. మారుతి సుజుకి డిజైర్ - 16,798 యూనిట్లు
6. మారుతి సుజుకి బ్రెజా - 15,787 యూనిట్లు
7. టాటా నెక్సాన్ - 13,914 యూనిట్లు
8. మారుతి సుజుకి ఈకో - 11,352 యూనిట్లు
9. టాటా పంచ్ - 11,169 యూనిట్లు
10. హ్యుండాయ్ క్రెటా - 10,421 యూనిట్లు
ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను హీరో పూర్తిగా డామినేట్ చేసింది. టాప్ ఫైవ్ టూ వీలర్ తయారీ కంపెనీల్లో 3,82,317 వాహనాలను విక్రయించి 37.65 మార్కెట్ షేర్‌ను సంపాదించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే 15.34 శాతం వృద్ధిని హీరో కనపరించింది. అలాగే గత నెలతో పోలిస్తే 9.41 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. కానీ రెండో స్థానంలో ఉన్న హోండా మాత్రం హీరోకు పూర్తిగా తిరోగమనంలో సాగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 20.52 శాతం, గత నెలతో పోలిస్తే 18.36 శాతం అమ్మకాలను హోండా కోల్పోయింది.