రేట్లు తగ్గడంతో Maruti Alto K10, S-Pressoకు మళ్లీ డిమాండ్ - 2025లో ఆల్‌టైమ్ రికార్డు సేల్స్
GST 2.0 అమలుతో ధరలు తగ్గడంతో మారుతి ఆల్టో K10, ఎస్-ప్రెస్సో అమ్మకాలు డిసెంబర్ 2025లో 92 శాతం పెరిగాయి. చిన్న కార్ల డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.

Maruti Suzuki 2025 sales: దేశీయ ఆటో మార్కెట్‌లో మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. ముఖ్యంగా చిన్న కార్ల విభాగంలో మళ్లీ డిమాండ్ ఊపందుకోవడం కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. GST 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గడంతో... గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. డిసెంబర్ 2025లో మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10), మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S Presso) అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన (2024 డిసెంబర్‌తో పోలిస్తే) 92 శాతం పెరగడం ఈ మార్పుకు బలమైన నిదర్శనం. 2024 డిసెంబర్‌లో ఈ రెండు కార్లు కలిపి 7,418 యూనిట్లు మాత్రమే విక్రయమవ్వగా, 2025 డిసెంబర్‌లో ఈ సంఖ్య 14,225 యూనిట్లకు చేరింది. 2025 నవంబర్‌తో పోలిస్తే కూడా, డిసెంబర్‌లో ఈ సెగ్మెంట్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది.
మారుతి మొత్తం సేల్స్‌లో మినీ సెగ్మెంట్ వాటా 6.2 శాతంగా నమోదైంది. ధరల భారం తగ్గడంతో పాటు ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చులు చిన్న కార్లను మళ్లీ ఆకర్షణీయంగా మార్చాయి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులు ఈ సెగ్మెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
“మినీ సెగ్మెంట్‌లో దాదాపు 100 శాతం వృద్ధి వచ్చినా కూడా ఒకన్నర నెలల పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. GST తర్వాత స్పష్టమైన డిమాండ్ మార్పు కనిపిస్తోంది” - మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ
కాంపాక్ట్ సెగ్మెంట్‌లోనూ స్ట్రాంగ్ సేల్స్
చిన్న కార్లతో పాటు కాంపాక్ట్ సెగ్మెంట్‌లోనూ మారుతి బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. బాలెనో, డిజైర్, వాగన్ R వంటి మోడళ్లు మొత్తం సేల్స్‌ను ముందుకు నడిపాయి. డిజైర్ 2025 మొత్తంలో మారుతి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలవగా, డిసెంబర్ నెలలో బాలెనో (Baleno) 22,108 యూనిట్లతో టాప్‌లో నిలిచింది. ఇవి కాకుండా Celerio, Ignis, Swift, Wagon R కూడా కాంపాక్ట్ సెగ్మెంట్ సేల్స్‌ను డ్రైవ్ చేశాయి.
2025 మారుతి సుజుకి మొత్తం విక్రయాలు
2025 మొత్తం మీద మారుతి సుజుకి 18,06,514 యూనిట్ల విక్రయాలతో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఇది, 2024తో పోలిస్తే 3 శాతం వృద్ధి. ఒక్క 2025 డిసెంబర్ నెలలోనే 1,78,646 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటికీ SUVలు, MPVలు మొత్తం సేల్స్‌లో 48 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల డిమాండ్ తిరిగి పెరగడం మార్కెట్‌లో కీలక మార్పుగా మారింది.
ముఖ్యంగా, మన దేశంలోని టాప్ 100 నగరాల వెలుపలి ప్రాంతాల్లో GST 2.0 ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ధరలు అందుబాటులోకి దిగి రావడంతో చిన్న కార్లు మళ్లీ సాధారణ కుటుంబాలకు మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే, 2026లో కూడా మారుతి చిన్న కార్లు మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















