Best Mileage Bike: కేవలం 2 సార్లు పెట్రోల్ పోసి నెలంతా తిరగొచ్చు - రోజుకు 900 మంది కొంటున్నారు
Bajaj Platina Sales Report: బజాజ్ ప్లాటినా 100 బైక్‌లో కంపెనీ 102cc ఇంజిన్ అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 PS పవర్‌ను, 8.3 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Bajaj Platina 100 Sales Report May 2025: బజాజ్ బైకులు మైలేజ్‌కు పెట్టింది పేరు. ఈ బ్రాండ్‌లో వచ్చిన ప్లాటినా 100, ఈ విభాగంలో అద్భుతం చేస్తోంది, కామన్ మ్యాన్‌కు కావలసినంత మైలేజ్ ఇస్తోంది. దీంతో, మన దేశంలో ఈ మోటర్ సైకిల్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అటు పల్లెలు, ఇటు పట్టణాలు & నగరాల్లో బజాజ్ ప్లాటినా బండిని భారీగా కొంటున్నారు. గత నెలలో (మే 2025) దేశవ్యాప్తంగా దాదాపు 28,000 మంది కస్టమర్లు ఈ టూవీలర్‌ను కొన్నారంటే డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీని అర్ధం.. రోజుకు సగటున 900 మంది ఈ బండిని సొంతం చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే, ఈ బండికి ఇంతమంది కొంటున్నా, వార్షిక ప్రాతిపదికన ప్లాటినా అమ్మకాలు తగ్గాయి.
తెలుగు నగరాల్లో బజాజ్ ప్లాటినా ధర ఎంత?
కచ్చితమైన లెక్క చెప్పాలంటే, గత నెలలో 27,919 మంది కొత్త కస్టమర్లు బజాజ్ ప్లాటినా 100 బైక్‌ను కొనుగోలు చేశారు. బజాజ్ ప్లాటినా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Platina 100 ex-showroom price) 68,294 రూపాయలు, ఇది బడ్జెట్ బండి. రిజిస్ట్రేషన్, బీమా, ఇతర టాక్స్‌లు, ఖర్చులు కలుపుకుంటే, తెలుగు నగరాల్లో ఈ మోటర్ సైకిల్ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ రేటు (Bajaj Platina 100 on-road price) దాదాపు 84,500 రూపాయలు అవుతుంది. వేరియంట్ & నగరాన్ని బట్టి ఈ ధర మారుతుంది. మార్కెట్లో, ప్రస్తుతం, ఈ బైక్ హోండా షైన్ (Honda Shine), టీవీఎస్ స్పోర్ట్స్ (TVS Sports) & హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) వంటి బైక్‌లకు పోటీ ఇస్తుంది.
బజాజ్ ప్లాటినా 100 ఇంజిన్ & పవర్
102 cc ఇంజిన్‌తో బజాజ్ ప్లాటినా 100 పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 PS పవర్‌ను 8.3 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ టూవీలర్ బరువు దాదాపు 117 కిలోలు, కాబట్టి దీనిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ బైక్‌లో అమర్చిన డ్రమ్ బ్రేక్‌లు మంచి బ్రేకింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఇంకా.. డీఆర్‌ఎల్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ & 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉన్నాయి.
బజాజ్ ప్లాటినా మైలేజ్
బజాజ్ ప్లాటినా 100కు 11 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఇది దేశంలోని అత్యుత్తమ మైలేజ్ బైక్‌లలో ఒకటి. ఈ బండి లీటరు పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ లెక్కన, ఈ బైక్‌కు ఉన్న 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను ఒకసారి ఫుల్ చేస్తే, 770 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మీరు రోజుకు సగటున 50 కిలోమీటర్లు రైడ్ చేస్తారని లెక్క వేసుకుంటే, మళ్లీ 15 రోజుల వరకు పెట్రోల్ బంక్‌కు వెళ్లక్కరలేదు. అంటే, నెలలో కేవలం రెండుసార్లు ట్యాంక్ ఫుల్ చేసి, ఈ బండిని ఫుల్లుగా వాడుకోవచ్చు.





















