Electric Vehicles vs Fuel Vehicles: ఈవీల్లో కన్నా పెట్రో వాహనాల్లోనే ఎక్కువగా మంటలొస్తాయట, ఎందుకంటే?
విద్యుత్ వాహనాల్లో కన్నా పెట్రో వాహనాల్లోనే ఎక్కువగా మంటలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలనూ వివరిస్తున్నారు.
పెట్రో వాహనాల్లోనే అధికంగా మంటలు..
పెట్రో ధరలు పెరిగినప్పటి నుంచి అందరూ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. పలు సంస్థలు కొత్త ఈవీ వేరియంట్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. టూవీలర్స్‌తో పాటు ఫోర్ వీలర్స్‌కి కూడా బాగానే డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు ఈవీ మార్కెట్‌జోరుమీదే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తరచుగా విద్యుత్ వాహనాలు కాలిపోతుండటం ఈవీ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. కొనుగోలు చేయాలని చూస్తున్న వారు కూడా ఈ ప్రమాదాల కారణంగా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. అయితే కొందరు వాహన రంగ నిపుణులు విద్యుత్ వాహనాల కన్నా పెట్రో వెహికిల్సే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు గురి అవుతున్నాయని తేల్చి చెబుతున్నారు.
బ్యాటరీల కారణంగానే అధిక నష్టం..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాలను పరిశీలించాకే ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. అయితే ఇక్కడే మరోఅంశం కీలకంగా చెప్పుకోవాలి. పెట్రో వాహనాల నుంచి మంటలు వచ్చినప్పుడు జరిగే నష్టంతో పోల్చి చూస్తే ఈవీలు దగ్ధమైనప్పుడు కలిగే నష్టమే ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణంగా ఈవీలోని బ్యాటరీ. ఈ బ్యాటరీలోని రసాయనాలు కాలినప్పుడు ఆ మంటల్ని ఆర్పడం అంతసులభం కాదు. ఇక విద్యుత్ వాహనాల్లో ఎప్పుడు మంటలు చెలరేగుతాయన్నది చెప్పటమూ కష్టమే. అదే పెట్రో వాహనాల్లో అయితే ఫ్యుయెల్ లీకేజ్ లాంటివి ప్రమాదాలకు కారణమవుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. విద్యుత్ కార్లను ఓవర్ ఛార్జింగ్ చేసినప్పుడూ ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదముంటుంది.
థర్మల్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం..
ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న సమయంలోనూ ఈవీల్లో నుంచి మంటలు వస్తాయి. ఇటీవల ముంబయిలో టాటా సంస్థకు చెందిన నెక్సాన్ ఈవీ కార్‌లో ఇదే జరిగింది. అందుకే థర్మల్ మేనేజ్‌మెంట్‌పై సంస్థలు దృష్టి సారించాలని ఈవీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇంజిన్‌డిజైన్‌లో అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ లిస్ట్‌లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ కార్‌లో మంటలు రావటం వల్ల ప్రజల్లో విద్యుత్ వాహనాలపై ఉన్న అపోహల్ని ఇంకా పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నారు.
ఇటీవల ఓ దేశంలో విద్యుత్ కార్‌లో నుంచి తీవ్ర స్థాయిలో మంటలు వచ్చాయి. ఆ మంటలు ఆర్పేందుకు చాలా సార్లు నీళ్లలో ముంచాల్సివచ్చింది. ఓవర్ ఛార్జింగ్ వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించారు. అందుకే ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతున్నప్పటికీ...ఈవీల్లో మంటలొస్తుండటం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తోంది.