YV Subba Reddy : విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభం ఎప్పుడంటే ? - అసలు విషయం చెప్పిన వైవీ సుబ్బారెడ్డి !
విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరమైన ప్రక్రియ వల్లే ఆలస్యం అవుతోందన్నారు.
YV Subba Reddy : సీఎం జగన్ ఎప్పుడు విశాఖకు క్యాంప్ కార్యాలయాన్ని తరలిస్తారనేది సస్పెన్స్ గామారింది. సెప్టెంబర్ నుంచి తన కాపురం విశాఖ నంచే ఉంటుందని .. సీఎం జగన్ గతంలో ఉత్తరాంధ్ర సభల్లో ప్రకటించారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు వచ్చినా తేలలేదు. తదుపరి విచారణ డిసెంబర్ కు వాయిదా పడింది. అంటే అప్పటి వరకూ కేసు తేలే అవకాశం లేదు. చట్ట పరంగా రాజధానిని తరలించడానికి లేదు. అందుకే సీఎం జగన్ విశాఖకు క్యాంప్ కార్యాలయం తరలిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.
ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విశాఖకు సీఎం క్యాంప్ కార్యాలయం
విశాఖ వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారె్డ్డి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సీఎం క్యాంప్ కార్యాలయం విశాఖకు వస్తుందని ప్రకటించారు. విశాఖనగర కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని అంశం గురించి చెప్పారు. న్యాయపరమైన వివాదాలు ఉండటం వల్లనే ఆలస్యం అవుతుందని.. రెండు నెలల్లో విశాఖకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం తరలి వస్తుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో.. జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయాన్ని మారుస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. వైవీ సుబ్బారెడ్డి మాటలతో.. క్యాంప్ కార్యాలయాన్ని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగాచెబుతున్నారు.
రుషికొండపై రెడీ అవుతున్న సీఎం క్యాంప్ కార్యాలయం
రుషికొండను తొలిచి నిర్మిస్తున్న భవనం సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనని చెబుతున్నారు. అయితే అధికారికంగా అదో టూరిజం ప్రాజెక్టు అని చెబుతున్నారు. కానీ క్యాంప్ ఆఫీసేనని.. అయితే తప్పేంటని.. బొత్స సత్యనారాయణ వంటి వారు ఒకటి రెండు సార్లు ఎదురుదాడి చేశారు. మరోవైపు ఆ భవనం కోసం విలాసవంతమైన ఫర్నీచర్ న విదేశాల నుంచి తెప్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నందున.. రెండు నెలల్లో మొత్తం రెడీ అవుతుందని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసును ప్రారంభిస్తారని భావిస్తున్నారు.
వాలంటీర్లపై చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే పవన్ వ్యాఖ్యలు
చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే పవన్ కల్యాణ్ వాలంటీర్లపైనా, సీఎం జగన్‌పైనా విమర్శలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. నీతి అయోగ్ సమావేశంలోను వాలంటీర్లను అభినందించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ వ్యవస్థను కొనియాడారన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా వాలంటీర్లు పారదర్శకంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వారు దోచుకున్నారని ఆరోపించారు. కానీ వాలంటీర్లు జన్మభూమి కమిటీల్లా దోపిడీలకు పాల్పడటం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారన్నారు.