MLC Election Results: స్థానిక సంస్థల కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో YSRCP విజయం
పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలిచారు.
ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీనే ఘన విజయం సాధించింది. తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ టీడీపీలో బరిలో నిలిచింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలిచారు. కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు వచ్చాయి. మొత్తం 1105 ఓట్లు ఉండగా 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటిప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.
ఇటు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూధన్ రావు గెలిచారు.
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలిచారు. ఈయనకు 636 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ కి 108 ఓట్లు వచ్చాయి.
ఈ 5 స్థానాల్లో ఏకగ్రీవం
స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితానికి రెండు రోజులు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 48 గంటలు పడుతుందని అంచనా. ఆరు జిల్లాల్లో కలిపి 2 లక్షలకు పైగా ఓట్లు వేశారు. 2007, 2011, 2017లలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రెండో ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు గెలిచారు. ఈసారి కూడా ఆ ఓటే కీలకం కానుందని సమాచారం. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో 500 మంది ఎన్నికల సిబ్బంది నాలుగు టీమ్‌లుగా ఏర్పడి విడతల వారీగా ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. ఏడు రౌండ్లలో 2,00,926 ఓట్లు లెక్కింపునకు కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుందని అంచనా.
మరోవైపు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.