Krishna Raju letter to PM Modi: మళ్లీ మీడియాతో మాట్లాడితే చంపుతామంటున్నారు... వైసీపీ ఎంపీ గోరంట్లపై రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు... ఎంపీ గోరంట్ల మాధవ్ పై ప్రధాని మోదీకి ఫిర్యాదుచేశారు. పార్లమెంట్ ఆవరణలో తనపై అనుచిత వ్యాఖ్యలుచేశారని లేఖలో పేర్కొన్నారు.
వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. మంగళవారం లోక్ సభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో తనను అనుచిత పదాలతో కించపరిచే విధంగా మాట్లాడారని రఘురామకృష్ణ రాజు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు ఈ విషయంపై ఎంపీ రఘురామ కృష్ణ రాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ రాశారు.
పార్లమెంట్ పరిధిలో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ రఘురామ లోక్ సభ స్వీకర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. లోక్ సభ వాయిదా అనంతరం సుమారు ఉదయం గం.11.50లకు బయటకు వచ్చిన సమయంలో...వైసీపీ ఎంపీలతో ఉన్న గోరంట్ల మాధవ్, ఆ పార్టీ ఎంపీల ప్రోద్బలంతో తనను అనుచిత పదజాలంతో దూషించినట్లు లేఖలో పేర్కొన్నారు. తనను బెదిరించినట్లు ఆ విషయాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి గోరంట్ల మాధవ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.
అలాగే తక్షణమే తనకు రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తి అని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో తనపై బెదిరింపులకు పాల్పడిన గోరంట్ల మాధవ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణ రాజు.
గతంలో రఘురామకృష్ణ రాజుపై వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అనర్హత విధించాలని కోరారు. ఈ అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనర్హత పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విని చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ తరఫున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణ రాజు గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. వ్యక్తిగతంగానూ దూషణలు చేశారు. రఘురామకృష్ణ రాజు చర్యలను తీవ్రంగా పరిగణించిన వైసీపీ..ఆయన పార్లమెంట్ సభ్యత్వంపై వేటువేయాలని స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు ఫిర్యాదు చేసింది.