CM Jagan Delhi Tour : తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లడమే లక్ష్యం - కేంద్ర పెద్దల్ని ఒప్పించడానికే జగన్ ఢిల్లీ పర్యటన !?
తెలంగాణతో పాటు ఏపీకీ ఎన్నికలు జరుగుతాయా ? అదే లక్ష్యంతో జగన్ ఢిల్లీ వెళ్తున్నారా?
![CM Jagan Delhi Tour : తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లడమే లక్ష్యం - కేంద్ర పెద్దల్ని ఒప్పించడానికే జగన్ ఢిల్లీ పర్యటన !? Will elections be held in AP along with Telangana? Is Jagan going to Delhi with the same goal? CM Jagan Delhi Tour : తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లడమే లక్ష్యం - కేంద్ర పెద్దల్ని ఒప్పించడానికే జగన్ ఢిల్లీ పర్యటన !?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/04/75bb957afcf4d337a5babc7e2363f8fe1688466158946228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటన ఎజెండా ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రత్యేక హోదా దగ్గర్నుంచి పోలవరం నిధుల వరకూ అన్నింటినీ అడుగుతున్నారని ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేస్తారు. కేంద్ర హోంమంత్రితో భేటీ అయినా అదే చెబుతారు. అసలు హోంమంత్రికి.. పోలవరం నిధులకు సంబంధం ఏమిటని విపక్షాలు విమర్శించినా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన వెళ్లేది సొంత పనులు, రాజకీయాల కోసమేనని విపక్ఇష నేతలు ఆరోపిస్తూంటారు. ఈ సారి కూడా సీఎం జగన్ పర్యటన ఎజెండా రహస్యంగానే ఉంది.
తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచన ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళ్లే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల సంక్షేమ పథకాల అంశం పక్కకు పోతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. వచ్చే ఏడాది మార్చి , ఏప్రిల్‌లో పోలింగ్ జరిగితే... ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే సూచనలు కనిపిస్తూండటంతో మరింత ఇబ్బందికరం అవుతుందని అందుకే ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారు.
ముందస్తుకు కేంద్ర సహకారం కోసమే ఢిల్లీ పర్యటన !
ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటున్నారు కాబట్టి మరోసారి మోదీని కలిసి చెప్పేందుకు వెళ్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్టోబర్‌లో అసెంబ్లీని రద్దు చేస్తే .. రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. అంటే జగన్ ఆరు నెలల ముందే అధికారం కోల్పోతారు కానీ.. ఎన్నికలు జరగవు. అందుకే ఆగస్టులోనే అసెంబ్లీని రద్దు చేస్తే ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రం ఎన్నిక కూడా జరుగుతుందని భావిస్తున్నారు.
మందస్తు ఖాయమని నమ్ముతున్న ఏపీ రాజకీయ పార్టీలు
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఈసీ అధికారుల్ని జగన్ సంప్రదించారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పట్నుంచో తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇక అసెంబ్లీ రద్దు కోసం నిర్ణయం తీసుకుంటే.. డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)