AP Politics: బీజేపీతో ఎందుకు విడిపోయారు? ఎందుకు కలిశారు? కూటమి నేతలు ప్రజల్ని ఎలా ఒప్పిస్తారు?
TDP - BJP - Janasena Alliance: రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందంటూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో చేరింది. ఈసారైనా విభజన హామీలపై మోదీ నుంచి హామీలిప్పిస్తారా?
TDP BJP Janasena Alliance: రానున్న సార్వత్రిక ఎన్నిలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీలు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. మొన్నటి వరకు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలకు తెరదించుతూ మూడు పార్టీలు కలిపి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. దీంతో పొత్తు చర్చలకు దాదాపు ముగింపు పలికినట్టు అయింది. అయితే ఇక్కడే పలు ప్రశ్నలు కూటమి నేతలు వైపు ఉత్పన్నమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. ఆ పార్టీ అభ్యర్థులకు జనసేన సపోర్ట్ చేసింది.
ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా ఎన్‌డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వేదికగా నిరసన దీక్ష చేపట్టి మరీ.. ప్రధాని మోదీ భార్య గురించి, కుటుంబం గురంచి ప్రశ్నలు సంధించారు. తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తెలుగుదేశం పార్టీ కార్యాకర్తలు రాళ్లు కూడా రువ్వారు. పవన్ కల్యాణ్ కూడా కేంద్ర పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఆరోపణలు ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో నచ్చని, రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతల చేయి పట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో నడిచేందుకు సిద్ధం కావడం పట్ల అనేక ప్రశ్నలు సాధారణ ప్రజలు నుంచే కాకుండా ఓటర్ల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. గతంలో రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందంటూ.. బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేసిందని ఆ పార్టీతో కలిసి వెళుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు బీజేపీతో పయనించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎన్నికలకు ముందు దూరమయ్యారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ బీజేపీపై దుర్భాషలాడారు. చంద్రబాబు అయితే దీక్షలు పెట్టి మరీ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందంటూ ఆరోపించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, పోలవరానికి నిధులు రాకుండా చేశారని, లోటు బడ్జెట్ పూడ్చలేదని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందంటూ చంద్రబాబు బీజేపీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న టీడీపీ చెందిన మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజీనామాలు చేశారు. దేశాన్ని పాలించే హక్కు బీజేపీ నేతలకు లేదంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తీవ్రంగా విభేదించిన బీజేపీతో ఇప్పుడు ఏరికోరి మరీ పొత్తు పెట్టుకోవడంపైనా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి గతంలో అన్యాయం చేసిన బీజేపీతో ఇప్పుడు చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారంటూ పలువరు ప్రశ్నిస్తున్నారు. విభజన తరువాత బీజేపీ గడిచిన పదేళ్లలో ఏ హామీలను నెరవేర్చిందని, భవిష్యత్‌లో ఏం చేస్తారన్న హామీ చంద్రబాబు మళ్లీ కలిశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం పూర్తి వంటి అంశాలను కేంద్రం గాలికి వదిలేసిందని, అటువంటి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా సాధారణ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఓట్లు పడే చాన్స్ ఉందా..?
గతంలో చంద్రబాబు బీజేపీపై చేసిన విమర్శలను ఇప్పుడు అధికార వైసీపీ కూడా చంద్రబాబును ప్రశ్నిస్తోంది. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో సాధారణ ఓటర్ల ఆలోచన ఎలా ఉంటుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి బీజేపీ గడిచిన పదేళ్లుగా అన్యాయం చేసిందన్న భావన ఎక్కువ మందిలో ఉంది. ఈ నేపథ్యంలో కూటమికి అటువంటి వారి ఓట్లు ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు.. పొత్తు ధర్మం ప్రకారం ఓట్లు వేస్తారు సరే. కానీ, ఏ పార్టీకి సంబంధం లేని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, కేంద్రం అందించే సహకారం వంటి అంశాలను మాత్రమే చూసి ఓట్లేసే ఎంతో మంది ఇప్పుడు కూటమికి ఏం చూసి ఓట్లేస్తారన్న ప్రశ్నలు కొన్ని వర్గాలు నుంచి, రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రధాని మోదీతో సభను నిర్వహించడం ద్వారా అనేక హామీలను ఇచ్చేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు.. ఇప్పుడు ఇచ్చే హామీలను ఎంత వరకు అమలు చేస్తారన్న భావన ప్రజల్లో ఉండే అవకాశముందని చెబుతున్నారు. చూడాలి మరి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రజల నుంచి ఏ స్థాయిలో ఆదరణ ఉంటోందో.