Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
YSRCP: పార్లమెంట్‌లో వైఎస్ఆర్‌సీపీ అమరావతిపై ఎలాంటి విధానం పాటించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ స్పందిస్తున్న్ తీరుతో వ్యతిరేకించాలి కానీ.. అలా చేసే చాన్స్ లేదు.

Amaravati YSRCP Amaravati Strategy: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ ముందుకు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు తేనున్నాయి. ముఖ్యంగా ఈ బుధవారం లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు మద్దతు నిలిచిన వైసీపీ, సొంత రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అమరావతి విషయంలో ఏ అడుగు వేస్తుందన్నది రాజకీయ విశ్లేషకులకు ఒక సవాలుగా మారింది.
అసెంబ్లీ తీర్మానానికి దూరం.. పార్లమెంట్‌లో ఏంటి దారి?
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చేసిన తీర్మానానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని అధికారికంగా స్వాగతించకపోవడమే కాకుండా, ఇది కేవలం రాజకీయ డ్రామా అని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ కారణంగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు దీనిని వ్యతిరేకిస్తారా లేదా గైర్హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వ్యతిరేకిస్తే అమరావతి వ్యతిరేకి అనే ముద్ర పడే ప్రమాదం ఉంది, సమర్థిస్తే తమ పాత మూడు రాజధానుల వాదనకు తిలోదకాలు ఇచ్చినట్లవుతుంది.
ప్రాంతీయ సెంటిమెంట్ - వైసీపీ ద్వంద్వ వైఖరి
వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాంతీయ సెంటిమెంట్లను రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారాన్ని వారు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా అమరావతి బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించడానికి ఒక బలమైన సాకును వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించే క్రమంలో నేరుగా బిల్లును వ్యతిరేకించకుండా, చర్చలో పాల్గొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేసి ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
ఇరకాటంలో వైసీపీ?
రాజకీయంగా చూస్తే వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అమరావతికి చట్టబద్ధత లభిస్తే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం అసాధ్యం అవుతుంది. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన వికేంద్రీకరణ సిద్ధాంతానికి గట్టి దెబ్బ. అందుకే, వైసీపీ ఈ బిల్లును పరిపాలనాపరమైన అవసరం కంటే రాజకీయ కక్ష గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్‌లో టీడీపీ సభ్యులు దూకుడుగా వ్యవహరించడం ఖాయం కాబట్టి, వారిని ఎదుర్కోవడానికి వైసీపీ తన వికేంద్రీకరణ' అస్త్రాన్ని మళ్ళీ బయటకు తీసే అవకాశం ఉంది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై వైసీపీ తీసుకునే నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశను, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఓటర్ల మొగ్గును శాసించనుందని అంచనా వేస్తున్నారు.























