Taneti Vanitha: నాకే పాపం తెలియదు, వాళ్లు చెబితేనే పోలీసులకు ఫోన్ చేశా - మంత్రి తనేటి వనిత
Taneti Vanitha Comments On Mahendra Issue: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర ఆత్మహత్యపై సీఐడీ విచారణకు సీఎం జగన్ ఆదేశించినట్లు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.
CID Enquiry On Mahendra Case Issue : తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర (Bontha Mahendra) ఆత్మహత్యపై సీఐడీ విచారణ (CID Enquiry)కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఆదేశించినట్లు హోంమంత్రి తానేటి వనిత (Taneti Vanitha) తెలిపారు. మహేంద్ర మృతి అనంతరం జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తనపైన, ప్రభుత్వంపైన దురుద్దేశంతో బురదజల్లుతున్నారని మంత్రి విమర్శించారు.
మంత్రి వనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పెనకనమెట్టలో 13వ తేదీన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త పోసిబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ఆయన సోదరుడి కుమారుడు మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారని తనకు చెప్పారు, వెంటనే స్టేషన్‌కి ఫోన్ చేయించి మహేంద్రను ఇంటికి పంపమని సూచించినట్లు తెలిపారు. తన సూచనలతోనే మహేంద్రను పోలీసులు ఇంటికి పంపినట్లు వెల్లడించారు.
మహేంద్ర పురుగుల మందు తాగినట్లు తర్వాత రోజు తనకు తెలిసిందని మంత్రి తానేటి వనిత చెప్పారు. మహేంద్ర చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో మాట్లాడానని, తర్వాత విజయవాడ తీసుకెళ్లినట్లు ఎవరూ చెప్పలేదన్నారు. 15వ తేదీ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఫోన్ చేసి మహేంద్ర మృతి విషయం చెప్పినట్లు వెల్లడించారు. మహేంద్ర కుటుంబం ఏమీ చెప్పకపోయినా తానే చొరవ తీసుకుని చేయగలిగిన సాయమంతా చేశానని అన్నారు.
మహేంద్ర మృతదేహం చూడడానికి నేతలతో కలిసి వెళ్తుండగా కొందరు యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడులు చేశారని మంత్రి చెప్పారు. తానేదో పోలీసుల్ని ఆర్డర్ చేసి మహేంద్రను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఇదీ జరిగింది
తూర్పు గోదావరి జిల్లా దొమ్మేరులో వైసీపీకి చందిన ఓ ఫ్లెక్సీ చిరిగిపోయిన వివాదంలో, ఎస్సీ యువకుడు మహేంద్రను పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పోలీసులు తీసుకెళ్లారు. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని చెప్పినా, సాయంత్రం వరకూ స్టేషన్ లోనే ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేంద్ర అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, మహేంద్ర బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో యువకుడు మృతదేహాన్ని పోలీసులు తెల్లవారుజామున దొమ్మేరు తీసుకురాగా, స్థానికులు నిరసన తెలిపారు. పోలీసుల తీరు వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై రాళ్లు, సీసాలతో దాడికి దిగారు.
ఈ క్రమంలో ఏఎస్సైకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు, జనసేన నాయకులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.