Rains in AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వానలు - త్వరలోనే తుఫాను
Weather Updates In AP Telangana: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
Rains in Telangana AP: గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం బలపడి ఇదివరకే తేలికపాటి అల్పపీడనంగా మారింది. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
అక్టోబర్ 18న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతుందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో నేడు సాధారణ వర్షపాతం నమోదుకానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నిన్న కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 16, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. సూచనతో ఉత్తరాంధ్ర జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అత్యధికంగా కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో అక్టోబర్ 22న తుఫాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. అర్ధరాత్రి అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో మాత్రం వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.