Vizianagaram: ఎందుకీ ఉద్యోగం గేదెలు కాచుకో! మహిళా ఎస్సైపై తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు
మహిళా ఎస్సైపై తహసీల్దార్ నోరుజారారు. ఉద్యోగం ఎందుకు, గేదెలు కాచుకో అంటూ దూషించారు. విజయనగరం జిల్లాలోని గోవిందపురం, లంకలపల్లి గ్రామాల మధ్య నెలకొన్న ఇసుక వివాదంలో ఈ ఘటన జరిగింది.
విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైపై తహసీల్దార్(Tahsildar) నోరుపారేసుకున్నారు. గేదెలు కాచుకో అంటూ అసభ్యరీతిలో దూషించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలమయ్యాయి. విజయనగరం(Vizianagaram) జిల్లా పూసపాటిరేగ మండలం తహసీల్దార్ కృష్ణమూర్తి మహిళా ఎస్సై జయంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనిచేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకో ఎందుకీ ఉద్యోగం(Job) అని అసభ్యరీతిలో మాట్లాడారు.
అసలేం జరిగిందంటే?
విజయనగరం జిల్లా గోవిందపురం(Govindapuram) గ్రామస్థులు లంకలపల్లి గుండా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుక(Sand)ను ఎడ్లబండ్ల ద్వారా తరలిస్తున్నారు. గోవిందపురం గ్రామస్థులు పెద్ద మొత్తంలో ఇసుకను తీసుకెళ్తున్నారని దీంతో బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సోమవారం గోవిందపురానికి చెందిన ఎడ్ల బండ్లను అడ్డుకోవడంతో ఇరు గ్రామస్థుల(Villagers) మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవ సమాచారం అందుకున్న ఎస్సై జయంతి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వివాదంపై ఆరా తీశారు. ఇరు గ్రామాల వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇరు గ్రామస్థులు ఎస్సై జయంతి మాట వినకుండా అక్కడే ఉన్నారు. ఎస్సై(SI) మాట వినకపోయేసరికి అక్కడే ఉన్న తహసీల్దార్ కృష్ణమూర్తి జోక్యం చేసుకున్నారు. గ్రామస్థులను నిలువరించడంలో ఎస్సై విఫలమయ్యారని అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయంపై ఎస్సై జయంతి, భోగాపురం(Bhogapuram) ఎస్‌ఐ మహేష్‌తో పాటు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యల గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు.
ఇరు గ్రామాల మధ్య ఇసుక చిచ్చు
విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక చిచ్చు రేగింది. పూసపాటిరేగ మండలం లంకలపల్లి-గోవిందపురం(Lankalapalli-Govindapuram) గ్రామాల మధ్య ఇసుక రవాణా(Sand Transport) ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పింది. తమ గ్రామానికి చెందిన కందివలస గెడ్డలో ఇసుక తరలించుకుపోయి వ్యాపారం చేసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా లంకలపల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో రెండు గ్రామల మధ్య వివాదం ముదిరింది. తాజాగా తమ గ్రామంలోని హైస్కూల్(High School) లో లంకలపల్లి విద్యార్థులు చదవటానికి వీల్లేదని అడ్డుకున్నారు గోవిందపురం గ్రామస్థులు. ఇది కాస్త పోలీసులు(Police), గ్రామ అధికారుల వరకూ వెళ్లింది. వివాదం ముదరడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు గ్రామాల సరిహద్దులు పోలీసులను మోహరించారు. పరిస్థితులు అదుపుతప్పకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు ఇరు గ్రామస్థులకు సర్థిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: దుబాయ్ పర్యటనలోనే మేకపాటికి గుండెనొప్పి ఉందా? ఆ వీడియోలో ఇబ్బంది పడుతున్న మంత్రి!