వైజాగ్ డేటా సెంటర్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
విశాఖపట్నంలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతుల ప్రక్రియను పక్కన పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది

Vizag Data Center: వైజాగ్ డేటా సెంటర్‌కు నిర్దేశిత అనుమతులు లేవని.. నిబంధనలకు విరుద్ధంగా భూమి బదలాయింపు జరిగిందన్నటువంటి ఆరోపణలపై ఏపీ హైకోర్ట్ స్పందించింది. ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ లీసాగిల్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పక్కనపెట్టలేమని కామెంట్ చేసింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
విశాఖలోని అడవివరం, ముడసర్లొవ గ్రామాల్లో సుమారు 160 ఎకరాల భూమిని వైజాగ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ (VHDCPL)కు కేటాయించడం, అనంతరం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం తదితర అంశాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని, పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత
పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యత అని విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలో పాల్గొన్న అధికారుల పేర్లు తమ ముందుకు వచ్చిన తర్వాత, నిబంధనల ఉల్లంఘన ఉంటే బాధ్యతను నిర్ధారిస్తామని తెలిపారు. ఈ కేసులోని అన్ని పక్షాలు వచ్చే వారం తమ కౌంటర్లు దాఖలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
డేటా లోకలైజేషన్‌పై పిటిషనర్ అభ్యంతరాలు
పిటిషనర్ తరఫు న్యాయవాది విరాగ్ గుప్తా వాదిస్తూ.. ఈ ప్రాజెక్టులో వాస్తవానికి అవసరమైన డేటా లోకలైజేషన్ లేదని పేర్కొన్నారు. భారతీయ డేటాను ఈ డేటా సెంటర్‌లో నిల్వ చేయనున్నట్లు చూపిస్తూ, డిజిటల్ ఎకానమీకి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందనే అభిప్రాయాన్ని కల్పించారని ఆయన ఆరోపించారు. అలాగే, పర్యావరణ ప్రభావ అంచనా (EIA) రికార్డుల్లో గూగుల్ పేరు స్పష్టంగా పేర్కొనలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 160 ఎకరాల భూమి సింహాచలం దేవస్థానానికి చెందినదని, అలాంటి భూమిని VHDCPLకు బదిలీ చేయడం లేదా లీజుకు ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. దేవస్థానానికి ఈ లీజు ద్వారా 26కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
కంబాలకొండ Ecology ప్రాజెక్టుకు ఇబ్బంది.
డేటా సెంటర్ నిర్మించనున్న ప్రాంతం కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఎకో-సెన్సిటివ్ జోన్‌కు కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఇది కేటగిరీ-ఏ ప్రాజెక్టుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో మరింత సమగ్ర పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వాదించారు. పర్యావరణ అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తులో కేవలం భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలే ఉన్నాయని, అసలు డేటా సెంటర్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించనున్నారనే అంశంపై తగిన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు భారీగా అవసరమయ్యే నీరు, విద్యుత్ సరఫరా విషయంలోనూ స్పష్టత లేదని కోర్టుకు తెలిపారు.
అన్ని చట్టాలను పాటిస్తాం: ప్రభుత్వం
ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సంబంధిత అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది ప్రభుత్వ శాఖలను ప్రతివాదులుగా చేర్చినట్లు వెల్లడించారు.
కేసును వచ్చే వారం మరోసారి విచారిస్తామని చెప్పిన హైకోర్టు.. అప్పటికి అన్ని పక్షాల వారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















