YS Sharmila: 2 పార్టీలు విఫలం, ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం చేస్తాం- పీసీసీ చీఫ్ షర్మిల
YS Sharmila: ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
APCC Chief YS Sharmila: ప్రత్యేక హోదా కాంగ్రెస్ (Congress)తోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి నాకంటే.. మీ అందరికీ బాగా తెలుసని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యం లా పని చేయాలని పిలుపునిచ్చారు షర్మిలారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాష్ట్రంపై చిత్తశుద్ది ఉందన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారని... కేంద్రంలో అధికారంలో వస్తే ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
హోదా సాధించడంలో రెండు పార్టీలు విఫలం
ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరోలా ఉండేదన్నారు. స్పెషల్ స్టేటస్ సాధించడంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విఫలం అయ్యాయని షర్మిలా రెడ్డి విమర్శించారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు, అధికారంలో వచ్చాక మరిచి పోయారని ఎద్దేవా చేశారు. హోదా అడిగితే చంద్రబాబును జైల్లో పెట్టించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిలా రెడ్డి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...ప్రతిపక్షంలో ఉన్నపుడు 25 ఎంపీ స్థానాలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ స్వలాభం చూసుకున్నారని విమర్శించారు.
ఐదేళ్లలో ఒక్కసారి హోదా కోసం ఉద్యమం చేశారా ?
ఈ 5 ఏళ్లలో ఒక్క సారి కూడా హోదాపై జగన్ ఆన్న గారు...ఉద్యమం చేసింది లేదంటూ షర్మిలా రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే...ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జగన్ ఆన్న గారు అధికారంలో వచ్చాక..జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడని...నాలుగున్నరేళ్లు మోసం చేసి...ఇపుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటున్నారని షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు వచ్చేది ఎన్నడు జగన్ సార్ అంటూ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం చేశానన్న ఆమె...మహిళలు చెప్పిన సమాధానం చూసి బాధ కలిగిందన్నారు. మద్య నిషేధం అని చెప్పిన నేతలు...దాన్ని మరచిపోయారని.. ఎక్కడ చూసినా మద్యం దొరుకుతుందన్నారు. మద్యం రేట్లు పెంచి..పేదల ఇళ్లను మరింత గుల్ల చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం చేయక పోతే ఓట్లు కూడా అడగన అంటూ జగన్ అన్నారని, మరి మద్య నిషేధం సంగతి ఎక్కడికి పోయింది జగన్ అన్న గారు అంటూ షర్మిలారెడ్డి ప్రశ్నించారు.
బీజేపీతో ఎందుకు దోస్తీ చేశారు ?
పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా వదిలేశారని షర్మిలారెడ్డి విమర్శించారు. అభివృద్ధి పక్కన పెట్టి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు...బీజేపీ జపం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీకి రెండు పార్టీలు బానిసలు మారాయని, బీజేపీ వద్దని ఆంధ్ర రాష్ట్రం తిరస్కరిస్తే... వీళ్ళు మాత్రం బీజేపీతో దోస్తీ చేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీకి పూర్తిగా ఈ రెండు అమ్ముడు పోయాయని, బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందని దోస్తీ చేస్తున్నారా ? అంటే నిలదీశారు. పోలవరం పనులకు నిధులు ఇచ్చారా ? రెండు కోట్ల ఉద్యోగాలలో మన రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారనా ? ఎందుకు దోస్తీ చేస్తున్నారో చెప్పాలన్నారు షర్మిలా రెడ్డి. ప్రజలు వద్దనుకున్న బీజేపీకి ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.