CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు
విశాఖపట్నంలో కే రామక్రిష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ముందస్తు ఎన్నికల మీదే నిర్ణయం తీసుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు.
![CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు CPI Ramakrishna accuses CM Jagan over early elections in AP CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/3c3e4c5d48f6660a2f38cf3d0a4d7e771685547743374234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలో ముందస్తు ఎన్నికల విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని అన్నారు. ఆయన ఆ పని చేస్తే ముందే అధికారం కోల్పోయి ఇంటికి వెళ్తాడని ఎద్దేవా చేశారు. జూన్ 7వ తేదీన సీఎం జగన్ అత్యవసరంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటున్నారని, ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికల (AP Early Elections) మీదే నిర్ణయం తీసుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో కే రామక్రిష్ణ మీడియాతో మాట్లాడారు.
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారని రామక్రిష్ణ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కార్పోరేట్లకు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికే అంటూ వ్యాఖ్యలు చేశారు. అదానీ లాంటి పెద్దలకి, తమ కడప దోస్తులకు ప్రయోజనం చేకూర్చుకునేందుకే అవసరం లేకపోయినా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా వీటిని ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి ఇళ్లు కట్టుకోవడానికి ఎకరాల భూమి కావాలి కానీ.. పేదలకు మాత్రం సెంటు భూమి ఇస్తున్నారని రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆర్ - 3 జోన్‌లో 3 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించాలని రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
ఐటీ రంగం దారుణం
ఇక ఐటీ రంగంపై మాట్లాడితే జగన్ ప్రభుత్వం ఉరేసుకోవాలని రామక్రిష్ణ ఎద్దేవా చేశారు. ఏపీ 0.14 శాతమే ఐటీ ఎగుమతులు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కంటే ఏపీ ఐటీ ఎగుమతులు అట్టడుగు స్థానంలో ఉన్నాయని అన్నారు. దీనికి జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.
సిగ్గుండాలి - రామక్రిష్ణ
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా రామక్రిష్ణ విమర్శలు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఈ హత్య కేసు దర్యాప్తు చేయడానికి సీబీఐకి సిగ్గు ఉండాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని ఆరోపించారు. సీబీఐకి విలువ లేకుండా వైఎస్ అవినాష్ రెడ్డి చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి అంతా బూటకమని, జగన్ మాటలన్నీ అవాస్తవాలే అని అన్నారు. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. కానీ, సొంత మీడియాలో మాత్రం విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, సొంత ప్రయోజనాలు, కేసుల విషయంపైనే జగన్ ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. అమరావతిని కిల్ చేసి, అమర్ రాజా కంపెనీని వేధించి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆక్షేపించారు. కియా, జాకీ పరిశ్రమలది అదే దుస్థితిగా ఉందని, దమ్ముంటే.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ఆర్ సీపీ నేతలు చర్చకు రావాలని రామక్రిష్ణ సవాలు విసిరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)