Atchannaidu: విశాఖలో ఫ్యామిలీపై దాడి ఘటన- చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
Andhra Elections 2024: విశాఖలో ఫ్యామిలీపై దాడి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీకి లేఖ రాశారు.
Tdp State President Atchannaidu Wrote A Letter To The EC : విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో నివాసం ఉంటున్న కుటుంబం టీడీపీకి ఓట్లేసిందంటూ దాడికి పాల్పడిన ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నచ్చిన పార్టీలకు ఓట్లేసిన వ్యక్తులపై దాడులకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపైనా కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి అచ్చెన్నాయుడు లేఖ ద్వారా తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి కథనాలు ప్రచురించిన మీడియాపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతోపాటు కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈసీ జోక్యంతో అదుపులోకి పరిస్థితులు
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న అచ్చెన్నాయుడు.. ఈసీ జోక్యం తరువాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఘటనలో బాధితులు గళం వినిపించిన పలు చానెల్స్ సిబ్బందితోపాటు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణు కుమార్‌రాజుపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని అచ్చెన్నాయుడు ఆ లేఖలో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా చేయాలని ఆయన కోరారు. విశాఖలో హింసను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరిన ఆయన.. అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాసిన ఈ లేఖపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.