By: ABP Desam | Updated at : 20 May 2022 08:06 AM (IST)
రాజీవ్ గాంధీ హత్యకు ముందు చిత్రం
Rajiv Gandhi Death Anniversary : ప్రపంచ రాజకీయాలనే షాక్ కు గురి చేసిన దుర్ఘటన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య. అంతవరకూ ఎన్నడూ లేని విధంగా మానవ బాంబ్ ను ఉపయోగించి ఆయన్ను హత్య చేసింది LTTE. అయితే ఆ హత్యకూ వైజాగ్ కు సంబంధం ఉంది. దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సమయం అది. మళ్లీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందని అంచనాలు బలంగా ఉన్నాయి. అయితే అందరి దృష్టి తమిళనాడు పైనే ఉంది. అక్కడ DMK తో పొత్తు పెట్టుకోవాలా లేక అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలా అన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో రెండు వాదనలు ఉన్నాయి. వారి మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు ఎన్నికల ప్రచారం చెయ్యడం కోసం రాజీవ్ గాంధీ దిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు. మే 20, 1991న దిల్లీలో బయలుదేరిన రాజీవ్ గాంధీ మే 22 వరకూ ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించాలి అనేది షెడ్యూల్. రాజీవ్ గాంధీతో పాటు, ఆయన మీడియా అడ్వైజర్ సుమన్ దూబే, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్, బల్గెరియా నుంచి వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు, పైలెట్స్ ఆ విమానంలో ఉన్నారు.
మే 21న వైజాగ్ చేరుకున్న రాజీవ్ గాంధీ
ఒడిశా, ఏపీల్లో పర్యటించిన రాజీవ్ గాంధీ మే 21కి వైజాగ్ చేరుకున్నారు. అక్కడ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆ సాయంత్రం తమిళనాడుకు బయలుదేరాలి. కానీ విమానం బయలుదేరే సమయంలో కమ్యూనికేషన్ సిస్టం పనిచెయ్యడం లేదని పైలెట్లలో ఒకరైన కెప్టెన్ చందోక్ గమనించారు. ఈ విషయం రాజీవ్ గాంధీతో చెప్పగానే స్వయంగా పైలెట్ అయిన రాజీవ్ గాంధీ ఆయనతో కలిసి ఆ సమస్యను సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దానితో ఆ రాత్రికి వైజాగ్ లోనే ఉండిపోవడానికి సిద్ధమైన రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు. ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లిపోగానే విమానం ఇంజినీర్ విమానాన్ని మరోసారి పరీక్షించి అందులోని లోపాన్ని సరిచేశారు. దీంతో విమానం రెడీ అయిపోయింది అనే వార్త విని వెంటనే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కి తిరిగి వచ్చారు. అయితే ఆయన వేరే కారులో వచ్చిన ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్ మాత్రం విమానాన్ని అందుకోలేకపోయారు. సాయంత్రం 6:30 కి విశాఖలో బయలుదేరింది విమానం. చెన్నైలోని మీనంబాకం ఎయిర్ పోర్ట్ లో 8:20కి దిగింది. అక్కడి నుండి 50 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ పెరంబదూర్ బహిరంగ సభకు హాజరు కావడం కోసం కారులో బయలుదేరి వెళ్లారు రాజీవ్ గాంధీ.
అంతా క్షణాల్లోనే
శ్రీ పెరంబదూర్ సభ వద్దకు చేరుకున్న రాజీవ్ గాంధీ ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి స్టేజ్ మీదకు వెళ్లడానికి జనం మధ్య నుంచి వెళ్లసాగారు. ఆయన వెళ్లే దారికి రెండువైపులా బారికేడ్లు పెట్టినా జనాన్ని ఆపడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్త లతా కన్నన్ అనే ఆమె తన కుమార్తె కోకిలతో రాజీవ్ వచ్చే దారిలో నిలబడి ఉంది. తాను రాసిన హిందీ గీతాన్ని రాజీవ్ ముందు తన కూతురుతో పాడించాలని ఆమె కోరిక. ఇక రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చేసరికి లిస్ట్ లో లేనివాళ్లు సైతం తోసుకు వచ్చేశారు. ఆ సమయంలోనే కళ్లజోడు పెట్టుకున్న ఒక యువతి చేతిలో పూలదండతో లతా కన్నన్ వెనకాల చేరింది. ఇది సెక్యురిటీ వాళ్లు గమనించలేదు. రాజీవ్ గాంధీ వస్తూనే వాళ్లని పలకరించారు. కోకిల తన గీతాన్ని వినిపించడంతో రాజీవ్ ఆమెతో మాట్లాడుతున్న సమయంలో ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న ఒక మహిళా SI దాన్ని గమనించి ఆమెను ఆపింది. అయితే రాజీవ్ గాంధీ ఆమెను అనుమతించమని చెప్పి ఆమె చేతిలోని దండను వెయ్యడానికి వీలుగా తలను వంచారు. ఆ దండ వేస్తూనే ఆమె తన చేతిలో అమర్చుకున్న స్విచ్ ను ఆన్ చేసింది.
16 మంది మృతి, 43 మందికి తీవ్ర గాయాలు
అది ఎంతటి శక్తివంతమైన బాంబ్ అంటే రాజీవ్ తో సహా చుట్టూ ఉన్న వాళ్లు లతా కన్నన్ ఆమె కూతురుతోపాటు మొత్తం 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. రాజీవ్ గాంధీ షూను బట్టి మాత్రమే ఆయన భౌతిక కాయాన్ని గుర్తుపట్టగలిగారు. ఆయన్ను అంత దారుణంగా చంపింది శ్రీలంకకు చెందిన ఉగ్రవాద సంస్థ LTTE తీవ్రవాది థాను అలియాస్ థెన్ మొని రాజారత్నంగా గుర్తించారు. రాజీవ్ గాంధీ మళ్లీ గెలిస్తే శ్రీలంకలో తమ ఆట కట్టిస్తారనీ, భారత బలగాలను మళ్లీ శ్రీలంక సైన్యానికి అండగా పంపుతారని LTTE ఈ దారుణానికి పాల్పడిందని ఈ కేసు దర్యాప్తు చేసిన SIT అధికారి కార్తికేయన్ తరువాత తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.
విశాఖలో ఆగిపోయి ఉంటే
హత్యకు సరిగ్గా నాలుగు గంటల ముందు విమానంలో సాంకేతిక సమస్య వచ్చి విశాఖలోని గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు రాజీవ్ గాంధీ . విశాఖలో గెస్ట్ హౌస్ లోనే ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతలు వి.హనుమంత రావు లాంటివాళ్లు ఆయనతోనే ఉన్నారు. ఇక రాత్రికి వైజాగ్ లోనే ఉండిపోయి తెల్లవారిన తరువాత డైరెక్ట్ గా కర్ణాటక వెళ్లిపోయి ఉంటే రాజీవ్ గాంధీ బతికుండేవారు. కానీ చివరి నిముషంలో విమానంలోని సమస్య తీరిపోవడంతో ఆయన బయలుదేరి తమిళనాడు వెళ్లారు. అదే ఆయనకు చివరి ప్రయాణం అయింది.
రాజీవ్ గుర్తుగా వైజాగ్ లో స్మృతి భవన్
అనంతరకాలంలో రాజీవ్ గాంధీ వైజాగ్ లో చివరిసారిగా ప్రసంగించిన ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఆయన విగ్రహంతో పాటు రాజీవ్ స్మృతి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ విషాదాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు
Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ
BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్ డౌన్’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !