Ayyanna Patrudu On Ysrcp : దువ్వాడ శ్రీను ఒకే ఫోన్ నెంబర్ తో 60 ఓట్లు, మేధావుల సభకి దొంగ ఓట్లతో వెళ్తారా? - అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu On Ysrcp : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మేధావుల సభకు దొంగ ఓట్లతో వెళ్తారా? అని మండిపడ్డారు.
Ayyanna Patrudu On Ysrcp : విశాఖకు మెట్రో రైలు సాధించడంలో సీఎం జగన్ ఫెయిల్ అయ్యారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 37 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో బాగా చదువుకున్న వారు ఎక్కువన్నా ఆయన... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు విజ్ఞతతో ఆలోచన చెయ్యాలని కోరారు. వైసీపీ అభ్యర్థి సుధాకర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పోలవరo ప్రాజెక్టు కోసం సీఎం గానీ, వైసీపీ నేతలు గానీ ఆలోచన చేశారా? అని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అడగడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఎందుకు అడ్డుకోవడంలేదని నిలదీశారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రం
"గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానీకి ఎందుకు అమ్మేశారు. ఈ ప్రాంత వైసీపీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు. రైల్వే జోన్ కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎప్పుడైనా అడిగారా? మెట్రో రైల్ ప్రాజెక్టు సాధించడంలో సీఎం జగన్ ఫెయిలయ్యారు. విశాఖ ESI ఆసుపత్రి ఏమయ్యింది. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రధానిని 16 సార్లు జగన్ ఎందుకు కలిశారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను రూ.25 వేల కోట్లకు తాకట్టు పెట్టేశారు. ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేసేశారు. అమరావతిలో రాజధాని ఏమయ్యింది. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉందా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది సీఎం జగన్ కాదా? రాష్ట్రంలో పూర్తయిన 7.59 లక్షల టిడ్కో ఇళ్ళు పేదలకు ఎందుకు ఇవ్వలేదు. ఎక్కువ ఎంపీలు ఇస్తే ప్రధాని మెడలు వంచి స్టేటస్ తెస్తానన్నారు. స్పెషల్ స్టేటస్ సంగతి ఏమయ్యింది. రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక, ఆఖరికి లేటరైట్ దోచేసి. భారతి సిమెంట్ కు తరలించలేదా? రుషికొండను బోడి గుండు చేస్తే ఎందుకు ఊరుకున్నారు." -అయ్యన్నపాత్రుడు
మేధావుల సభకి దొంగ ఓట్లతో వెళ్తారా?
సీఎం జగన్ ఏం సాధించారని వైసీపీ అభ్యర్థికి ఓటయ్యాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వైసీపీ ఇన్ని అక్రమాలు చేస్తే బీజేపీ అభ్యర్థి మాధవ్ ఎప్పుడైనా కౌన్సిల్ లో ప్రశ్నించారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలకు చెప్పారా? అని నిలదీశారు. విశాఖకు వచ్చిన ప్రధానికి బోడి గుండైన ఋషికొండను చూపించమంటే, ఎందుకు చూపించే ప్రయత్నం చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని డైవర్ట్ చేస్తుంటే మాధవ్ ఎందుకు మాట్లాడలేదని ఆరోపించారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా ఓటేయమని అడగడం ఎంత భావ్యమన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మేధావుల సభకి దొంగ ఓట్లతో వెళ్తారా? అని ప్రశ్నించారు.
దువ్వాడ శ్రీను ఒకే ఫోన్ నెంబర్ తో 60 దొంగ ఓట్లా తీసుకున్నారని ఆరోపించారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యలను బెదిరిస్తే చర్యలు లేవన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.