Daggubati Purandeswari : ఎన్టీఆర్ సామాజిక డాక్టర్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదు -పురంధేశ్వరి
Daggubati Purandeswari : ఎన్టీఆర్ ఒక సామాజిక డాక్టర్ అని, వెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసివేయడం సబబు కాదని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
Daggubati Purandeswari : ఎన్టీఆర్ అంటే విపరీతమైన గౌరవం ఉందని చెప్తున్న సీఎం జగన్ ఇలా పేరు మార్చడం సబబు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ఒక సామాజిక డాక్టర్ అన్నారు. నవంబర్ 1, 2001 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అనేక సంస్కరణలు చేశారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారో సీఎం జగన్ చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు పెట్టిన అనేక పథకాలు పేర్లు మారి ఉండవచ్చు కానీ చాలా వరకు అవే అమలు అవుతున్నాయని పురేంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ పట్ల బీజేపీకి అపార గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్లమెంట్ లో ఏర్పాటు చేయడానికి తాను పోరాటం చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ హెల్త్ విశ్వ విద్యాలయానికి ఏ కారణం లేకుండా పేరు మార్చడం, ఎన్టీఆర్ కు జరిగిన అవమానంగానే భావించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లింపు
"ఈ నెల 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు మోదీ జన్మదినోత్సవం వేడుక చేస్తున్నాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా పక్వడా పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గడిచిన మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకునివెళ్లాలని ప్రజాపోరు నిర్వహిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడాం. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ఆరోగ్యకరమైన పరిస్థితి లేదు. రూ.2 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై వేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది. పెట్టుబడులు రావడానికి కావలిసిన మౌలిక సదుపాయాలు కల్పనలో రాష్ట్రం విఫలమైంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇంతకు ముందు అమరావతికి అంగీకరించిన సీఎం జగన్ ఇప్పుడు మూడు రాజధానులని ఎందుకు అంటున్నారో తెలియడంలేదు."- దగ్గుబాటి పురంధేశ్వరి
మద్య నిషేధంపై మాట తప్పారు
ఏ రాష్ట్ర ప్రభుత్వంపై లేని కేసులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గుత్తేదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. 2019 లో ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వారికి ఏమి చెయ్యలేదన్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మద్య నిషేధం అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలో కేంద్రం వేల కిలోమీటర్ల రోడ్లు వేయించిందన్నారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తారా?
రేపు రాష్ట్రం పేరు జగన్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తారా అని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. విశాఖ ఆర్కే బీచ్ పేరు జగన్ బీచ్ అంటారా? రుషి కొండ పేరు జగన్ కొండ గా మారుస్తారా>? ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చడం సరికాదన్నారు. 2024లో జగన్ అధికారంలోకి రావడం జరగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు కోసం బీజేపీ ఆలోచిస్తుందన్నారు. ప్రజలు మేలుకోవాలని సూచించారు. టీవీ ఛానల్ పేర్లు కూడా మార్చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.