(Source: ECI/ABP News/ABP Majha)
బాలినేనికి దెబ్బ మీద దెబ్బలు, పార్టీ మారడం ఖాయమేనా ?
Prakasam Politics: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికార వైసీపీలో దెబ్బ మీద పడుతున్నాయి. ఒంగోలు ఎంపీగా మాగుంటను కొనసాగించాలని పట్టుబట్టిన ఆయన...అధిష్ఠానం మొండి చేయి చూపించింది.
Ongole Politics : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) కి అధికార వైసీపీ (Ycp) లో దెబ్బ మీద మీద పడుతున్నాయి. ఒంగోలు (Ongole) ఎంపీగా మాగుంట (Magunta )ను కొనసాగించాలని పట్టుబట్టిన ఆయన... అధిష్టానం మొండి చేయి చూపించింది. ఓ మెట్టుదిగిన బాలినేని...అధిష్టానం మాటే శిరోధార్యం అంటూ ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీలో ఉంటారని స్పష్టం చేసింది. ఇంతలోనే చెవిరెడ్డికి ప్రకాశం జిల్లాతోపాటు కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యవహారంతో పుండు మీద కారం చల్లినట్లుగా పరిస్దితి తయారైంది. విజయవాడ నుంచి ఒంగోలుకు వచ్చిన ఆయన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పార్టీ మారవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. సన్నిహితులతో చర్చించిన అనంతరం ఆయన ఓ నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీపై పూర్తి పట్టున్న బాలినేనికి...ఇప్పుడు జిల్లాలో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న భావనలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేని బాలినేని...హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ప్రతీసారి ఆయనకు వ్యతిరేకంగా ఓ నిర్ణయం వెలువడటం.. ఆయన సైలెంట్ గా ఉండిపోవటం...వైసీపీ అధిష్టానం బుజ్జగించటం పరిపాటిగా మారింది. ఓ దశలో మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనైన బాలినేని...కంటతడి పెట్టుకున్నారు.
చెవిరెడ్డి మనిషి ఒంగోలుకు బదిలీ
మాగుంట సీటు విషయంలో వెనక్కి తగ్గిన బాలినేని...ఎంపీ సీటు చెవిరెడ్డికి కేటాయించడంతో పాటు రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా కేటాయించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. ఇంతలోనే చెవిరెడ్డి సూచించిన పోలీస్ అధికారిని...ఆగమేఘాల మీద తిరుపతి నుంచి ఒంగోలుకు బదిలీ చేయడం మరింత ఆగ్రహం తెప్పించింది. భూసేకరణకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను హడావుడిగా వారి అకౌంట్లలో జమచేసింది. గత మూడు నాలుగు రోజులుగా సాగతీసిన అధికారులు రెండు వందల మంది రైతులకు 120 కోట్లకుపైగా చెల్లించారు. బాలినేనిని సంతృప్తిపర్చే ఎత్తుగడలో భాగంగానే హడావుడిగా రైతులకు డబ్బులు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్లపట్టాల సేకరించిన భూములకు నగదు కోసం సీఎంఓ చుట్టూ తిరిగారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎంతో మాట్లాడి వాటిని విడుదల చేయించుకోగలిగారు.
పొమ్మనకుండా పొగపెడుతున్నారా ?
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని...రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. సామాజిక వర్గాల సమీకరణలతో మంత్రి పదవిని కోల్పోయారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా పని చేశారు. 30 ఏళ్ల బాలినేని రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా...తన వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి గుడ్ బై చెప్పిన బాలినేని...ఒంగోలు నియోజకవర్గంలో పని చేసుకుంటానని ప్రకటించారు. రీజనల్ కో-ఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత...బాలినేనికి ప్రాధాన్యత తగ్గిపోయింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలో సమస్యలు గుర్తించి సీఎం జగన్ వరకూ చేర్చారు. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. వైసీపీని వీడతారనే ప్రచారం జోరందుకుంది. పార్టీని వీడే ఆలోచనలో బాలినేని లేరని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీని వీడవద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం బాలినేనికి పొమ్మనకుండా పొగ పెడుతోందని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలకు తలొగ్గి పనులు చక్కబెడతారా.. లేక పార్టీని వీడతారా.. ? జిల్లా వైసీపీలో లెక్కలు ఎలా ఉంటాయి.. వైసీపీ అధిష్టానం ఆలోచనలేంటి.. తెలియాలంటే వేచిచూడాలి.