వైసీపీ పల్నాడు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ? మాజీ మంత్రి అనిలా ? మంత్రి విడుదల రజినినా ?
పల్నాడు రాజకీయం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో...వైసిపి ఎవర్ని బరిలోకి దించుతుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.
Narsaraopet Parliament : పల్నాడు (Palnadu) రాజకీయం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు (Krishnadevarayalu) రాజీనామాతో...వైసిపి ఎవర్ని బరిలోకి దించుతుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. అధిష్టానం ముందు నుంచి భావిస్తున్నట్లుగా యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతుందా ? లేదంటే కొత్తగా బీసీ అభ్యర్థిని బరిలోకి దించబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కృష్ణదేవరాయలుకు గట్టిగా సమాధానం చెప్పాలని భావిస్తున్న అధికార పార్టీ...బలమైన అభ్యర్థిని రంగంలో దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కీలక నాయకుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మంత్రి విడదల రజిని పేరు కూడా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీసీల ఓట్లు ఏడు లక్షలు
నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో లక్షా పాతిక వేలకు పైగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏడు లక్షలపైగా ఉన్నాయి. యాదవ్ సామాజిక వర్గం కూడా బీసీ కిందకే వస్తుంది. ఇక్కడ ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలోకి దించాలా ? లేదంటే బీసీ సమూహం కింద మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలా అన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం. అందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ కూడా అధిష్టానాన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో నాగార్జున యాదవ్‌ను పార్లమెంటుకు అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆలోచన చేసింది. అయితే దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బయటకు వెళ్లిపోయిన కృష్ణదేవరాయలును ఓడించి తీరాలన్న ఆలోచనతో ఉంది వైసీపీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపీగా ఇక్కడ పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అనిల్ యాదవ్ కాకుండా విడుదల రజిని
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కాకుంటే బీసీ మహిళా కోటాలో విడుదల రజిని పేరు పరిశీలించవచ్చన్న ప్రచారం...పల్నాడు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు కూడా కృష్ణదేవరాయలుతో వర్గపోరు నడిపారు మంత్రి విడదల రజిని. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఒకే పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వస్తే, ఆ పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కృష్ణదేవరాయులు అడుగులు టిడిపి వైపు పడతాయా ? టిడిపి నరసరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలు పోటీలో ఉంటారా ? అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని నిలపాలన్న ఆలోచనలో ఉంది వైసిపి అధిష్టానం.
హూ ఈజ్ ఎంపీ క్యాండిడేట్ ?
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలతో పల్నాడు ప్రాంతం రాజకీయ వేడి రగిలిస్తోంది. ఎక్కడికక్కడ హూ ఈజ్ ఎంపీ క్యాండిడేట్...అంటూ నాయకులు, కార్యకర్తలు, రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో మాత్రం ఆసక్తికర పోరు జరగబోతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి అధిష్టానాలు అభ్యర్థులను ఫైనలైజ్ చేసేది ఎప్పుడన్న ప్రశ్నలు వస్తున్నాయి.