Rotten Meat Seize: విజయవాడలో చికెన్, మటన్ కొంటున్నారా, అది తింటే నేరుగా ఆస్పత్రికే - కొనేముందు జాగ్రత్త సుమా
Rotten Meat Seize: విజయవాడలో మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. 500 కిలోల వరకు కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు.
Rotten Meat Seize: వీకెండ్ వచ్చిందంటే చాలు చికెన్, మటన్ విక్రయాలు జోరందుకుంటాయి. కానీ అదే సమయంలో నాసిరకం మాంసం విక్రయాలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. విజయవాడలోని మాంసం దుకాణాలపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ - వీఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని మాంసం దుకాణాల్లో చెడి పోయిన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున చెడి పోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
భారీగా కుళ్లిన మాంసం పట్టివేత
మున్సిపాల్ అధికారుల దాడుల్లో దాదాపు 500 కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే మాంసాన్ని అమ్ముతున్న మాంసం దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల కిందట వినుకొండలో అమ్మకానికి రెడీగా ఉంచిన కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏపీ నుండి చెన్నైకి రైలులో కుళ్లిన మాంసాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు
కుళ్లిన మాంసం అమ్ముతున్న వారిపై కేసులు
అధికారుల దాడులు ముఖ్యంగా మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్ నగర్, కొత్త పేట మార్కెట్లలో జరిగాయి. కుళ్లిన, చెడిపోయిన మాంసాన్ని అమ్ముతున్నారన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో ఈ మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. మాచవరంలో దాదాపు 500 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన మాంసాన్ని అమ్ముతున్న దుకాణ యజమానిపై కేసు పెట్టారు. భారీ ఎత్తున కుళ్లిన మాంసం దొరకడంపై అటు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇటు వినియోగదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్ని రోజులు తాము తిన్నది చెడుపోయిన మాంసమా అని ఆందోళన చెందుతున్నారు.
మాంసం కొనేముందు జాగ్రత్త సుమా
కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించిన మున్సిపల్ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. మాంసం కొనే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాంసాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతే కొనాలని చెప్పారు. చెడి పోయిన మాంసాన్ని తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. ఎవరైనా, ఎక్కడైనా చెడి పోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తెలిస్తే.. అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. కుళ్లిన మాంసం అమ్మే దుకాణ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుళ్లిన మాంసం వల్ల అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉన్నందున.. దానికి కారణం అవుతున్న మాంసం అమ్మే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
కొన్ని రోజుల కిందట ఏపీ నుండి రైళ్లలో తరలిస్తున్న దాదాపు 2 వేల కిలోలకు పైగా కుళ్లిన మాంసాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అక్కడి పురపాలక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత జులై నెలలోనూ ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కృష్ణ లంక భూపేష్ నగర్ లో రాము అనే వ్యాపారి కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ వ్యాపారి దుకాణంపై తనిఖీలు చేపట్టిన నిల్వ ఉంచిన 150 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూపేష్ నగర్ లోని రాము అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.