Vijayawada: ఈ ఏడాది దుర్గమ్మకు రెట్టింపు ఆదాయం - ఇక మిగిలింది హుండీల కౌంటింగ్
Vijayawada Durgamma Temple: ఈ ఏడాది దసరా ఉత్సవాలలో దుర్గమ్మకు గత ఏడాది కంటే దాదాపు రెట్టింపు ఆదాయం సమకూరినట్టు దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు.
Vijayawada Durgamma Temple: విజయవాడ కనక దుర్గమ్మకు దసరా ఉత్సవాల్లో రెట్టింపు ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆరు కోట్ల 34 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో ఆదాయం సమకూరింది. గతేడాది 4.08 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో దుర్గమ్మకు గత ఏడాది కంటే దాదాపు రెట్టింపు ఆదాయం సమకూరినట్టు దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు. దసరా ఉత్సవాల్లో 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పండుగ తర్వాత నాలుగు రోజుల్లో సుమారు 4 లక్షల మంది ఇంద్రకీలాద్రికి తరలివచ్చారని ఆమె పేర్కొన్నారు.
దర్శనం టికెట్లతో రెట్టింపు ఆదాయం
గతేడాది దర్శనం టికెట్ల ద్వారా 1.10 కోట్ల ఆదాయం దుర్గమ్మ ఖజానాకు చేరగా, ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది. అదే విధంగా పూజా టికెట్ల ద్వారా గత ఉత్సవాల్లో 65 లక్షల రూపాయలు రాగా, ఈ ఏడాది 1కోటి 3 లక్షల రూపాయలు వచ్చాయన్నారు. గతేడాది లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా 1.58 కోట్లు రాగా ఈ ఏడాది సుమారు 16.50 లక్షల లడ్డూల విక్రయాల ద్వారా 2.48 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. తలనీలాల టికెట్ల ద్వారా గత సంవత్సరం 12 లక్షల రూపాయలు రాగా, ఈ ఏడాది 20 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.
హుండీల్లో కూడా భారీగా కానుకలు....
దుర్గమ్మ ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు (Durga Temple Hundi Income), మొక్కుబడుల లెక్కింపు కార్యక్రమం ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మహామండపం ఆరో అంతస్తులో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. దసరా ఉత్సవాలు సందర్బంగా భక్తుల మెక్కుబడులను అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో దేవస్దానంలో ఉన్న హుండీలతో పాటుగా అదనంగా మరి కొన్ని హుండీలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతారు.దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం కూడ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దసరా ఉత్సవాలు అక్టోబర్ 5వ తేదీన ముగిసినప్పటికి 9వ తేదీ ఆదివారం వరకు భక్తుల రద్దీకొనసాగింది. లక్షల సంఖలో భక్తులు తరలిరావటంతో పాటుగా, భవానీ భక్తులు కూడా పెద్ద ఎత్తున దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. దీంతో హుండీ ఆదాయం కూడ భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఎడాది హుండీ ఆదాయం ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆదాయం లభించింది.
ఆది దంపతుల ఊరేగింపుకు భారీగా సన్నాహాలు..
దసరా ఉత్సవాల్లో ఆది దంపతులు ఇంద్రకీలాద్రి నుంచి కిందకు దిగి, కృష్ణానదిలో హంస వాహనం పై ఊరేగటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఎడాది భారీ వర్షాల కారణంగా ఊరేగింపును రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో మరో సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు, ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే మెదలయ్యాయి. భవానీ దీక్షల విరమణ కార్తీక మాసంలో ఉంటుంది. దీంతో ఇదే సమయంలో ఆది దంపతులను ఇంద్రకీలాద్రి నుంచి కిందకు తీసుకు వచ్చి,హంస వాహనం పై ఊరేగించేందుకు అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.