గుంటూరు ఘటన వైసీపీ స్లీపర్‌సెల్స్ పనే: టీడీపీ నేత వర్ల రామయ్య
అమాయాకుల్ని బలిగొనడమే జగనన్న అసలు రాజకీయమా, అసలు రాజకీయం అంటే జైలు రాజకీయమా..లేక బాబాయ్ ని చంపిన రాజకీయమా అని వర్ల రామయయ్య ప్రశ్నించారు.
పేదల సంక్రాంతి కానుక ఇచ్చేందకు జగన్ ను పిలవలేదనే అక్కసుతోనే అధికార పక్షం కుట్రతో వ్యవహరించిందని, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. గుంటూరులో జరిగిన సభలో ముగ్గురు చనిపోవడానికి కారణం అధికార పక్షమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు సభలను భగ్నం చేయడానికే ప్రభుత్వం గుంటూరులో దారుణానికి పాల్పడిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కార్యక్రమంలో ముగ్గురు చనిపోవడం వెనుక అధికారపార్టీ స్లీపర్స్ సెల్స్ పాత్ర ఉందని విమర్శించారు. జనవరి నుంచి జగనన్న అసలు రాజకీయం చూస్తారు, అన్న వైసీపీ సోషల్ మీడియా సందేశం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.
అమాయాకుల్ని బలిగొనడమే జగనన్న అసలు రాజకీయమా, అసలు రాజకీయం అంటే జైలు రాజకీయమా..లేక బాబాయ్ ని చంపిన రాజకీయమా అని వర్ల రామయయ్య ప్రశ్నించారు. చంద్రబాబు సభలు, కార్యక్రమాలకు వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి గంగవెర్రులెత్తుతున్నారని అన్నారు. ఒక ఎన్ఆర్ఐ పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారని, సదరు కార్యక్రమం గురించి ముందుగానే నిర్వాహకులు పోలీసులకు చెప్పారని కూడా అన్నారు. ఆ కార్యక్రమానికి 200మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశామని, నిర్వాహకులు కూడా వారికి సహకరించారని చెప్పారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని వెళ్లాకే దురదృష్టకర ఘటన జరిగిందని చెప్పారు.
200మంది పోలీసులు భద్రతలో ఉన్నా, చంద్రబాబు కార్యక్రమానంతరం వెళ్లిపోయాక అక్కడ ముగ్గురు ఎలాచనిపోయారని అనుమానాలు వ్యక్తం చేశారు. నిజంగానే చనిపోయారా..లేక చంపబడ్డారా అనేది ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వమే ఈ మరణాలకు కారణమని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే ఈ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. గుంటూరులో చంద్రబాబు కార్యక్రమంలో ముగ్గురు చనిపోవడం వెనుక అధికారపార్టీ స్లీపర్స్ సెల్స్ పాత్ర ఉందన్నారు. అంత కచ్చితంగా ఎలా చెబుతున్నామంటే, ఘటన జరిగిన 10నిమిషాల్లోనే మరణవార్త నేషనల్ మీడియాలో వచ్చింది. ఎలా వచ్చిందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. సదరు ఘటనపై నేషనల్ మీడియాకు ముందే ఎవరు ఉప్పందించారని ప్రశ్నించారు.
నిమిషాల్లో ఘటన తాలూకా వార్తలు జాతీయ ఛానల్స్‌లో ప్రసారమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే వైసీపీకి చెందిన ఛానల్ లో వచ్చిందన్నారు. గుంటూరు దుర్ఘటనపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో అసలు వాస్తవాలు బయటకురావని, అసలు దోషులు దొరకరన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీని సక్రమంగా దర్యాప్తు చేయనిస్తే, నిందితుల్ని పట్టుకోగలరు. కానీ ప్రభుత్వం ఆయన్ని ఈ ఘటనలో అడుగు ముందుకు వేయనివ్వదని చెప్పారు.
జగనన్న అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారు, ఒక్కొక్కడు వణకాల్సిందే కావాలంటే ఈ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోండి ,అంటూ నవంబర్లో వైసీపీ సోషల్ మీడియాలో మెసేజ్లు రావడం వెనకున్న ప్రధాన ఉద్దేశం, అంతిమలక్ష్యం ఇలా సామాన్యుల్ని బలితీసుకోవడమేనా అని వర్ల రామయ్యప్రశ్నించారు. జనవరి నుంచి జగనన్న అసలు రాజకీయం చూస్తారంటే, జైలు రాజకీయమా..లేక బాబాయ్ ని చంపిన రాజకీయమా అని ప్రశ్నించారు. మొద్దు శీనుని, డాక్టర్ సుధాకర్ ని, విక్రమ్ కుమార్ లాంటి దళితుల్ని చంపిన రాజకీయమా అని నిలదీశారు.
మంచి ఉద్దేశంతో పేదలకు సాయంచేయాలని వచ్చిన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు మనసుని ఈప్రభుత్వం తీవ్రంగా గాయపరిచిందన్నారు. ప్రభుత్వమే ఈవిధంగా కుట్రలు పన్నుతుంటే, పేదలకు సాయం చేయడానికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. ఉయ్యూరి శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అతని అరెస్ట్ ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.