Vangaveeti Radha Engagement: వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్దం- పెళ్లి డేట్ సైతం ఫిక్స్, వధువు ఎవరంటే!
Vangaveeti Radha Engagement: దివంగత నేత వంగవీటి మోహనరంగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Vangaveeti Radha Engagement:
దివంగత నేత వంగవీటి మోహనరంగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. టీడీపీ నేత వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహం పెద్దలు నిశ్చయించారు. ఇరు వైపుల బంధువుల సమక్షంలో ఆదివారం (సెప్టెంబర్ 3న) వంగవీటి రాధా, పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది.
వధువు ఎవరంటే..
నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధా కృష్ణకు వివాహం ఖాయం చేశారు. త్వరలో వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం జరగనుడటంతో వంగవీటి అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. పుష్పవల్లి ఎవరంటే.. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాని బాబ్జీల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లినే వధువు. ఇరువురి పెద్దల సమక్షంలో నరసాపురంలో రాధాకృష్ణ, పుష్పవల్లిల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. గత నెలలో వీరి నిశ్చితార్థం జరగనుందని సైతం ప్రచారం జరగడం తెలిసిందే. నేడు (ఆదివారం) వీరి ఎంగేజ్ మెంట్ వైభవం జరిగింది. అక్టోబర్ నెలలో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటి కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు సహా పలువురు రాజకీయ నేతలు ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.
వంగవీటి రాధా వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 22న సాయంత్రం వంగవీటి రాధా, పుష్పవల్లిలు వివాహ బంధంలో ఒక్కటి కానున్నారు. వధువు పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987 నుంచి 92 వరకు నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా సేవలు అందించారు. పుష్పవల్లి నరసపురం, హైదరాబాడ్ లో చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్ లో యోగా టీచర్ గానూ పనిచేసినట్లు సమాచారం. మరోవైపు రాధా గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది.
వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం..
2004 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా వంగవీటి రాధా కృష్ణా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా.. అప్పుడప్పుడు మాత్రమే అభిమానులు, స్నేహితుల ఆహ్వానం మేరకు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. వంగవీటి రంగా విగ్రహాలను ప్రారంభిస్తున్నారు.
2004 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి చెందారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు రాధా. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో టీడీపీ కండువా కప్పుకున్నారు వంగవీటి రాధా. ఆ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మాత్రం వెళ్లి మద్దతు తెలిపారు.