గుడివాడలో టెన్షన్ టెన్షన్- రంగా వర్ధంతి జరుపుతామంటున్న టీడీపీ
గుడివాడ నివురుగప్పిన నిప్పులా రగిలిపోతోంది. రంగా వర్ధంతిని జరిపి తీరుతామంటూ వైసీపీ, టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.
గుడివాడలో రాత్రి మొదలైన టెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం స్థానికుల్లో నెలకొంది. రంగా వర్ధంతి వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చు రేపాయి. తాము నిర్వహిస్తామంటే తామంటూ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడం వివాదానికి కారణమైంది.
గుడివాడ పొలిటికల్ గ్రౌండ్ వైసీపీ, టీడీపీ రణరంగం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ మాటల తూటాలకు పరిమితమైన నేతలంతా ఇప్పుడు నేరుగా కార్యరంగంలోకి దిగి తొడు కొడుతున్నారు. తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వస్తోంది.
రంగా వర్ధంతి సెంట్రిక్‌గా గుడివాడలో కాకా రేగింది. రంగా వర్థంతి కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వీటిని అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ లీడర్లపై దాడికి యత్నించారని మండిపడుతున్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగుమాల కాళీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడని అంటున్నారు. రావిని చంపేస్తామని బెదిరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దమ్ముంటే రావిని టచ్ చేయాలని కార్యకర్తలు సవాల్ చేశారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వాళ్లు వినకపోయేసరికి లాఠీ ఛార్జ్ చేశారు.
ఇంతలో టీడీపీ ఆఫీస్‌కు దగ్గర్లో పెట్రోల్ ప్యాకెట్లు కనిపించడం పరిస్థితిని మరింత సీరియస్‌గా మారింది. రావి వెంకటేశ్వరరావును హతమార్చడానికే వైసీపీ లీడర్లు పెట్రోల్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చారని... తాము అలర్ట్‌గా లేకుంటే దారుణం జరిగేదంటున్నారు టీడీపీ కేడర్. లేదు ఇదంతా టీడీపీ లీడర్లు చేస్తున్న హైడ్రామాగా చెబుతున్నారు వైసీపీ లీడర్లు. గొడవ జరిగి 12 గంటలు గడిచినా నివురుగప్పిన నిప్పులా ఉంది గుడివాడ. పోలీసుల నిఘా నీడలో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో అన్న కంగారు ప్రజల్లో కనిపిస్తోంది.
గుడివాడ ఇన్సిడెంట్‌పై టీడీపీ నేతలు చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్ అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయంటున్నారు. రావి వెంకటేశ్వరరావును చంపుతామని వైసీపీ లీడర్లు బహిరంగంగానే హెచ్చరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడులు రేపి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే వైసీపీ లక్ష్యమన్నారాయన. ఇంత చేస్తున్నా వైసీపీ నేతలను పోలీసులు రిక్వస్ట్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం నుంచి పారిపోయే మొదటి వ్యక్తి నానియేనని అభిప్రాయపడ్డారు.
గుడివాడలో రంగా వర్ధంతి జరిపి తీరుతామన్నారు రావి వెంకటేశ్వరరావు. కొడాలి నాని ప్రోద్బలంతోనే గడ్డం గ్యాంగ్ రెచ్చిపోయి అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తే తన అంతు చూస్తానంటూ వైసీపీ బెదిరిస్తోందని.... గుడివాడలో రంగా వర్ధంతి చేసి తీరుతామని ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండని సవాల్ చేశారు.