మూల్పూరి కళ్యాణి అరెస్టుపై టీడీపీ ఆగ్రహం- జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్ వ్యవహరం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తోంది.
మూల్పూరి కళ్యాణి కేసులో పోరు తీవ్రం చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. న్యాయపోరాటంతోపాటు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఆమెను పోలీసులు ఇష్టానుసారంగా లాక్కెళ్లి అరెస్ట్ చేయటాన్ని టీడీపీ తప్పు పడుతోంది. బెడ్ రూంలోకి వెళ్ళి మరి ఆమెను ఇబ్బందులకు గురి చేయటంపై సీరియస్ అవుతోంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖలు చేశారు.
మహిళా నేత బెడ్ రూంలోకి పోలీసులు..
తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్ వ్యవహరం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తోంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (NCW), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(AP DGP)కి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. బెడ్‌రూంలోకి వెళ్ళి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం దారుణమయిన చర్యగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై జోక్యం చేసుకొని మహిళగా కళ్యాణికి న్యాయం చేయాలని తెలుగు మహిళలు ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
డ్రగ్స్‌కు అడ్డగా మారింది: అనిత
గత మూడున్నరేళ్లలో డ్రగ్స్‌ను ఆధారంగా చేసుకొని జరిగే నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని ఈ సందర్బంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతోపాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. గన్నవరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దాడి చేస్తే తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణిని నిందితురాలిగా చేర్చారని, ఏప్రిల్ 10న గన్నవరం, హనుమాన్ జంక్షన్ పోలీసులు కళ్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్ళటం దారుణమైన చర్యని ఆవేదన వెలిబుచ్చారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని, తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేయటం హేయమయిన చర్యని అన్నారు. తన వ్యక్తి గత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడం కాకుండా, మహిళ అనే కనీస మర్యాదలను కూడా పాటించకపోవటం వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్నారు.
మహిళలపై నేరాలు కట్టడి చేయాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోసుకుంటున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. కళ్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పారు.
చట్టపరంగా పోరాటం....
తెలుగు దేశం పార్టీకి చెందిన గన్నవరం మహిళా నాయకులు మూల్పూరి కళ్యాణిని అక్రమంగా అరెస్ట్ చేయటంతోపాటు, మహిళను అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల కనీస మర్యాదలు పాటించకపోవటం, బెడ్ రూంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించటంపై తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు భగ్గుమంటున్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంతోనే ఇలా దారుణంగా ప్రవర్తించారని తెలుగు దేశం ఆరోపిస్తుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లోనే అంతా జరిగిందని ఈ ఘటనపై అవసరం అయితే న్యాయ స్దానంలో ప్రైవేట్ కేసు దాఖలు చేసేందుకు చట్టపరమైన అంశాలను కూడా తెలుగు దేశం పరిశీలిస్తోంది.