Tirumala Laddu Controversy: తిరుమల కల్తీ ఘటన- ఆలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందన్న శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ
Swamyji On Tirumala Laddu | పెనమలూరు: ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఫేమస్. అందులోనూ శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే చాలు మరింత భక్తితో స్వీకరిస్తారు. అలాంటిది తిరుమల లడ్డూ కల్తీ అని తేలడంతో భక్తులకు దేవాలయాలపై విశ్వాసం తగ్గిందని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్య మతస్తులతో ఉద్యోగాలు చేయించకూడదన్నారు. తిరుమలలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారుచేశారని పరీక్షల్లో తేలడంతో భక్తులకు అన్ని దేవాలయాలపై భక్తులకు నమ్మకం తగ్గిందని, ఏ ప్రసాదంలో ఏం కలిపారోనని అర్థంకాక భక్తులు అయోమయం చెందుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనుక పవిత్రమైన తిరుమల ఆలయంలో జరిగిన అపచారానికి కారుకులైన వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టాలన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని దేశంలోని ప్రముఖ ల్యాబ్ చెప్పింది. అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర జరిగిందని తేలిపోయిందన్నారు. కానీ ఆ ల్యాబ్ రిపోర్టులనే తప్పు అంటే ఇంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు.
‘గత వైసీపీ ప్రభుత్వంలోనే దేవాలయాల్లో ఇతర మతస్తులకు పదవులు ఇవ్వకూడదని కోర్టులో కేసులు కూడా వేశాం. కానీ ఆ సమయంలో ప్రభుత్వం మాపై అక్రమకేసులు పెట్టి మరీ మా నోరు నొక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఇలా అధర్మం చేసినా అధికారి కుమారుడు చనిపోయాడు అనేది వాస్తవం. ఇప్పటికైనా తిరుమల అంశంపై చర్యలు తీసుకోవాలి. తిరుమల లడ్డూ నాణ్యతను నాశనం చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. తిరుమలలో కల్తీ నెయ్యి, లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీయడంపై సీబీఐ విచారణ చేపట్టాలని. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా రాష్ట్రం ప్రభుత్వo చర్యలు చేపట్టాలని’ శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ కోరారు.