Salman Khan: వైజాగ్ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు
Salman Khan: విశాఖపట్నంలో నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ సందడి చేశారు. వారితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.
Salman Khan: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు ముందే ప్రారంభమయ్యాయి. చారిత్రక కట్టడాలు, మాన్యుమెంట్స్, ఇతర కట్టడాలపై త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. మూడు రంగుల విద్యుద్దీపాలు ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు.
వేడుకల్లో పాల్గొన్న సల్లూ భాయ్
సంబరాల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. మూవీ షూటింగ్‌లతో బిజిబిజీగా ఉన్న సల్లూభాయ్.. తన షూటింగ్ లకు విరామం ఇచ్చి ఇండిపెండెన్స్ డే సంబరాల్లో పాల్గొన్నారు. నేవీ సైనికులతో ఒక రోజంతా గడిపారు సల్మాన్ ఖాన్. భారత నౌకా దళ ఈస్ట్ కమాండ్‌కు ప్రధాన స్థావరమైన వైజాగ్‌లో నేవీ సిబ్బందితో సరదాగా గడిపారు.
View this post on Instagram
వంటవార్పు, పాటలకు డ్యాన్స్ లు
భారీ భారతీయ జాతీయ పతాకాన్ని ఊపుతూ వేడుకలను ఆరంభించారు సల్మాన్ ఖాన్. తర్వాత సంబరాల్లో భాగంగా నేవీ సిబ్బందితో కలిసి పలు పాటలకు డ్యాన్స్ చేశారు. భారత నావికా సిబ్బందితో కలిసి పుష్-అప్ లు కూడా చేశారు. తర్వాత నేవీ కార్యాలయంలోని చపాతీ మేకర్ వద్ద చపాతీలు కాల్చారు సల్లూ భాయ్. భారత దేశానికి రక్షణగా నిలిచే నేవీ సైనికులతో ఆడి పాడటం వారిలో ఆనందాన్ని నింపింది. వారితో కలిసి రోజంతా గడపడం అటు సైనికుల్లో, ఇటు సల్మాన్ ఖాన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేడుకలు ఆద్యంతం సందడిగా సాగాయి. చివర్లో నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్.. ఫోటోలకు ఫోజులిచ్చారు. పలువురు నేవీ సిబ్బంది సల్మాన్ ఖాన్ తో సెల్ఫీలు దిగారు.
ఆగస్టు 15, రిపబ్లిక్ డేలు సందర్భంగా సెలబ్రిటీలు సైనిక స్థావరాలకు వెళ్లి వారితో సరదగా గడపడం ఎప్పటి నుంచో ఉంది. టాలీవుడ్ హీరోలు కూడా అలా వెళ్లి సైనికులతో ముచ్చటించారు. రోజంతా వాళ్లతో ఉన్నారు. ఆ వరుసలో మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండ ఉన్నారు. ఆయా సందర్భాల్లో దేశ సైనికుల వద్దకు వెళ్లారు. వాళ్లతో ఆడుతూ పాడుతూ అక్కడే రోజంతా గడిపారు. ఇన్నాళ్లు జరిగిన వేడుకలు ఒక ఎత్తు అయితే ఈసారి జరుగుతున్న సంబరాలు మరో ఎత్తు.
హర్ ఘర్ తిరంగా
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ వజ్రోత్సవాలను ప్రభుత్వాలు, ప్రజలు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆగష్టు 1౩ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని కోరారు. జాతీయ పతాకంతో దేశ ప్రజల అనుబంధాన్ని మరింత పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటినీ భాగం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ సిబ్బందితో ప్రతి ఇంటికీ జాతీయ జెండాలు, కర్రలు పంపిణీ చేస్తున్నారు. తర్వాత ఇంటి యజమానుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. ఆగస్టు 13 నుంచి పంద్రాగస్టు వరకు త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై ఎగురవేయాలని, వారు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
ఫ్లాగ్ కోడ్ సంగతి ఏంటి
జాతీయ జెండా ఎగురవేయడానికి కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి 2002లో ఫ్లాగ్ కోడ్ అమలులోకి వచ్చింది. ఆ కోడ్ ప్రకారం జాతీయ జెండాను అగౌరపరచడం నేరం. ఇంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే జాతీయ జెండా ఎగురవేసే వారు. కానీ 2022 జులై 20 నాటి సవరణ ప్రకారం, పగలు, రాత్రి కూడా జాతీయ జెండా ఎగురవేయవచ్చు.