Sajjala Ramakrishna Reddy: మరో కొత్త నినాదంతో జనాల్లోకి వైసీపీ, వివరాలు వెల్లడించిన సజ్జల
AP News: జగన్ ‘సిద్ధం’, ‘మేమంతా సిద్ధం’ వంటి ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. సిద్ధం నినాదంతో వివిధ చోట్ల పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించారు. మేమంతా సిద్ధం నినాదంతో రోడ్ షో నిర్వహించారు.
Jagan Kosam Siddham: ఏపీలో ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో అధికార పార్టీ మరో నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘సిద్ధం’, ‘మేమంతా సిద్ధం’ ప్రచార కార్యక్రమాలతో పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్లారు. సిద్ధం నినాదంతో వివిధ చోట్ల పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించారు. మేమంతా సిద్ధం నినాదంతో రోడ్ షో నిర్వహించారు. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ శ్రీకారం చుట్టింది. "జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమం రూపొందించిందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియా సమావేశం నిర్వహించారు.
జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించామని.. మ్యానిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం అని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తామని చెప్పారు. బూత్ సభ్యులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తారని చెప్పారు. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో వైసీపీ అధిష్ఠానం ప్రచార వేగాన్ని మరింత పెంచనుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ‘సిద్ధం’ పేరిట పలు చోట్ల భారీ బహిరంగ సభలు పెట్టారు. మరో 22 రోజులపాటు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ఇది ఏప్రిల్ 24 వరకూ సీఎం వైఎస్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజే 25న పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత రోజు నుంచి మరో 15 రోజుల్లో సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. ఈ 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌కు శ్రీకారం చుట్టారు. ‘జగన్ కోసం సిద్ధం’ కార్యక్రమంతో గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు ఆ పార్టీ శ్రేణులు నిర్వహించబోతుండగా.. సీఎం జగన్ మాత్రం రోడ్ షోల్లో పాల్గొననున్నారు.
అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబే - సజ్జల
‘‘మళ్లీ రూ. 4000 ఇస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నాడు, కొన్నివర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్ అంటున్నాడు. మరోపక్క వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని చంద్రబాబు, టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డతో కలిసి పింఛన్లు ఇంటి వద్ద అందకుండా చేశాడు. మళ్లీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపిణి చేయమని ఈసీకి సలహాలు ఇస్తారు. అవ్వాతాతలు అపసోపాలు చూసి మాకు సంబంధం లేదని మాట మారుస్తాడు. ఈ రోజు రాష్ట్రంలో అవ్వాతాతలు ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబు మాత్రమే.. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే జీవితాలతో చెలగాటమాడతాడు’’ అని సజ్జల అన్నారు.