Vijayawada: పబ్జీ ఆడే బాలుడిది హత్యా ఆత్మహత్యా? సవతి తల్లే అంతం చేసిందా?
Vijayawada: ప్రభు కుమార్ మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్యా, లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా, అనే విషయాలపై ఇంకా క్లారిటి రాలేదు.
Vijayawada News: ఇంతకీ ఏది నిజం. పబ్జీ ఆటకు బలయ్యాడా.. లేక సవతి తల్లే అతణ్ని చంపేసిందా... ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. మొదట పబ్జి ఆటలొ ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే కన్న తండ్రి, సవతి తల్లి కొట్టి చంపేశారని బాలుడి తల్లి ఆరోపిస్తుంది. దీంతో ఈ వ్యవహరం తీవ్ర కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో గత ఆదివారం జరిగిన ప్రభు కుమార్ (16) మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆత్మహత్యా, లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా, అనే విషయాలపై ఇంకా క్లారిటి రాలేదు.
అయితే తన కుమారుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఉరి వేసుకున్నట్లయితే , ఇంట్లో రక్తపు మరకలు ఎలా ఉంటాయని ప్రభు తల్లి లక్ష్మీ నరసమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో వి.రాజు కుటుంబం నివాసం ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగా శాంత రాజు భార్య లక్ష్మీ నరసమ్మ భర్తతో విడిపోయి విజయవాడలో ఉంటూ జీవనం సాగిస్తోంది. రాజు, లక్ష్మి నరసమ్మకు, ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. పెద్ద కొడుకు వృథ్వీరాజ్ తల్లితో పాటే విజయవాడలో ఉంటుండగా, మిగిలిన ముగ్గురూ మచిలీపట్టణంలో తండ్రి రాజు తో ఉంటున్నారు.
రాజు రెండో భార్య రాధికకు, లక్ష్మి నరసమ్మకు పుట్టిన పిల్లలకు మధ్య కుటుంబ వ్యవహారాల్లో విభేదాలున్నాయి. రెండో తల్లి సక్రమంగా చూడటం లేదని అనేక సార్లు పిల్లలు తండ్రి రాజు వద్ద వాపోయారు.ఈ నేపథ్యంలోనే రాజు రెండో కుమారుడు ప్రభు కుమార్ కు ,పెంపుడు తల్లి రాధికకు శనివారం గొడవ జరిగింది. ఆ తరువాత రాత్రి అందరితో కలిసి నిద్రించకుండా వేరే గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత ఆదివారం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి గదిలో ఉన్న ఫ్యాన్ కు ప్రభు కుమార్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి 108కి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. అయితే, ప్రభు కుమార్ మరణించిన గదిలో రక్తపు మరకలు, అతని శరీరంలోని వ్యక్తిగత ప్రదేశాల్లో తీవ్రమయిన గాయాలున్నాయని గుర్తించారు.
దీంతో అనుమానం వ్యక్తం కావటంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కుమారుడు ప్రభు కుమార్ ఉరివేసుకుని, చనిపోలేదని, ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారని తల్లి లక్ష్మి నరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కుమారుడి మరణంతో లక్ష్మీనరసమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. తన భర్తకు, తనకు విభేదాల కారణంగా కోర్టు కేసులు ఉన్నాయని తన ఆర్థిక పరిస్థితి, సహకరించకపోవటంతో రెండో కుమారుడిని తండ్రి వద్దనే ఉంచానని ఆమె అంటున్నారు.
కొద్ది రోజులు తన వద్దే ఉండి, ఇటీవలే మచిలీపట్నానికి వెళ్లారని అన్నారు. ప్రభు కుమార్ శరీరంపై గాయాలున్నాయని, ఉరివేసుకుని మరణించిన గదిలో రక్తపు మరకలున్నాయని ఆమె తెలిపారు. శాంతరాజు, రాధికనే చంపేశారని, పోలీసులు దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే పబ్జీ గేమ్ లో ఓడిపోవడంతో మనస్థాపం చెంది తన కుమారుడు ఉరేసుకున్నాడని ప్రచారం చేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి సెల్ ఫోన్ లేదని, అలాంటప్పుడు పబ్జీ ఎలా ఆడతాడని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.చిలకలపూడి సీఐ శ్రీధర్ మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక ఆదారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.