Andhra Pradesh New CS : ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నీరబ్‌కుమార్ నియామకం- జవహర్‌రెడ్డి బదిలీ
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ను నియమితులు అయ్యారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని బదిలీ చేశారు.
Neerab Kumar As New CS Of AP: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ను నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు సీఎస్‌గా ఉన్న జవహర్ సెలవుపై వెళ్లడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నియమితులైన నీరబ్ కుమార్ కేవలం 20 రోజులు మాత్రమే విధులు నిర్వహించున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మార్పులు చేర్పులు చకచకా జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే సీఎస్ మార్పిడి జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలా మారిపోయి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన్ని బదిలీ చేయాలని చాలా సార్లు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు సీఎస్‌ను బదిలీ చేయించారు.
కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తాను ఉండటం ఇష్టం లేదని గ్రహించిన జవహర్ రెడ్డి సెలవు పెట్టేశారు. దీంతో కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ను నియమించిన గవర్నర్... జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నీరబ్‌కుమార్ కొన్ని రోజుల పాటు సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఐఏఎస్‌లలో నీరబ్‌కుమార్ సీనియర‌్ కావడంతో సీఎస్‌గా నియమితులయ్యారు.
1987 బ్యాచ్‌కు ఏపీ కేడర్‌కే చెందిన నీరబ్‌కుమార్ ఇప్పుడు అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు చేపడుతున్నారు. ఈయన ఈ నెలలోనే రిటైర్‌మెంట్ తీసుకోనున్నారు. 20 రోజుల కోసమే నీరబ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమిస్తున్నారు. ఆ తర్వాత విజయానంద్ కానీ లేదా వేరే వ్యక్తిని నియమించే ఛాన్స్ ఉంది.