న్యాయం కోసం పోరాడుతాం- చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారు: బాలకృష్ణ
అవినీతిలో కూరుపోయిన జగన్... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ప్రభుత్వం... చంద్రబాబును ఇరికించిందన్నారు బాలకృష్ణ. టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఫ్రేమ్ చేయడానికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ను సృష్టించారని నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ స్కామ్‌లో ప్రేమ్‌చంద్రారెడ్డి, అజయ్ ఖల్లాం రెడ్డి పేర్లు ఎక్కడ అని నిలదీశారు.
చంద్రబాబుపై కక్ష సాధింపుతో ఎలాంటి ఆధారాలు లేకుండా చట్టాలని అతిక్రమించి నేరాన్ని మోపారన్నారు నందమూరి బాలకృష్ణ. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఓ బ్రాండ్... ప్రపంచ దేశాలే ఆయన గురించి చెప్పుకుంటున్నాయన్నారు. ఇప్పుడు పాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా... తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టే చంద్రబాబు కనీసం 16 రోజులైనా పెట్టాలనే దురుద్దేశంతోనే స్కామ్‌ను క్రియేట్ చేశారన్నారు.
యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2013లో గుజరాత్‌లో ప్రారంభించారని తెలిపారు. 2015లో ఎంవోయూ సైన్ చేశారు సీఎం ఓకే చెప్పిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లింది మాత్రం కింది స్థాయి సిబ్బంది. దీన్ని ప్రపోజ్ చేసింది అజయ్ కల్లాం రెడ్డి, ప్రమ్‌చంద్రారెడ్డి ఆ కంపెనీలతో ప్రాసెస్ పూర్తి చేశారు. నిధులు కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఒకటి కంపెనీ సాఫ్ట్‌వేర్, ఒకటి హార్డ్‌వేర్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రపంచంలో ఎక్కైడనా వాళ్లు ఇదే పద్ధతి పాటిస్తారు. ఇందులో ప్రభుత్వం 370 కోట్లు ఖర్చు పెట్టాం. 2 లక్షల 13 వేల మందికి ట్రైనింగ్ కల్పించి ఉపాధి కల్పించాం.
ప్రజలు కూడా ఆలోచించుకోవాలని సూచించారు బాలకృష్ణ. ఇప్పటికే పన్ను పోటుతో ఇబ్బంది పడుతున్న జనం మరోసారి అవకాశం ఇస్తే మరింత దుర్బరం అవుతారని హెచ్చరించారు. ఆలోచిస్తూ కూర్చుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని.. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని సూచించారు. ప్లాన్ చేసి చంద్రబాబును కేసుల్లో ఇరికించారని అలాంటి వాటికి భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదన్నారు బాలకృష్ణ. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు అన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తాను అన్నారు. ఎవ్వరికీ భయపడనక్కర్లేదని కేడర్‌కు, ప్రజలకు సూచన చేశారు. నేను వస్తున్నా.. నేనే ముందుంటా పోరుదాం రండీ అంటూ ధైర్యం నింపారు.
ఆలోచించడం కాదుని... రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే. జగనుకు మనుషులేంటేనే అలర్జీ అని విమర్శించారు. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు- విదిల్చే స్వభావం జగన్‌ది అన్నారు. రూ. 10 ఇచ్చి రూ. 100 గుంజుకునే రకం వైసీపీదన్నారు.
హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే ఇప్పుడు కనిపిస్తోందన్నారు బాలకృష్ణ. వీళ్లు వచ్చాక తట్ట మట్టి కూడా వేసిందని చెప్పుకొచ్చారు. మాట తప్పని పార్టీ తమదన్నారు. మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి పార్టీకి వారసత్వంగా వచ్చిందన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసిందన్నారు బాలయ్య. ఇప్పుడూ అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవే కాదు ఇంకా కేసులు పెడతారని అంచనా వేశారు. జగన్ లండన్ ఎందుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళే జగన్ ఏపీకి వచ్చారంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో అని ఎద్దేవా చేశారు.
ప్రజాపక్షాన పోరాడతామన్నారు బాలయ్య. మన శక్తి అయిన యువతని స్ట్రీమ్ లైన్ చేయాలన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం వాళ్లను గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయన్నారు. ఏపీని ప్రపంచ పటంలో లేకుండా జగన్ చేశారన్నారు.