Kodikatti Seenu Parents: జగన్‌పై కోడికత్తితో దాడి గుర్తుందా? నిరాహారదీక్షకు ఆ నిందితుడి తల్లిదండ్రులు, సీఎం ఇంటి ఎదుటే!
Kodikatti Seenu Parents: కోడికత్తి సీను తల్లిదండ్రులు నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ఎదుటే నిరాహార దీక్ష చేయబోతున్నామని సీను సోదరుడు సుబ్బరాజులు వెల్లడించారు.
Kodikatti Seenu Parents: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో ఓ యువకుడు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో రిమాండు ఖైదీగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు నాలుగు ఏళ్ల నుంచి బెయిల్ రాకపోవడంపై అతని తల్లి సావిత్రి, తండ్రి తాతారావు, సోదరుడు సుబ్బరాజు ఈనెల 25వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.
2019లో కోర్టు బెయిల్ మంజూరు చేసి విడుదల.. కానీ
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంక గ్రామానికి చెందిన జనిపల్లి శ్రీనివాసరావు విశాఖ యువజన్ ఫుడ్ క్యాంటీన్‌లో సర్వర్ బాయ్‌గా పని చేసేవాడు. 2018 అక్టోబరు 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తరువాత ఎన్‌ఐఏ కూడా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కేసు విచారణ తరువాత 2019 మే 25న శ్రీనివాసరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు.
విచారణ నిమిత్తం మళ్లీ రిమాండ్..
అయితే విచారణ నిమిత్తం మళ్లీ 2019 ఆగస్టు 13న ఎన్‌ఐఏ అధికారులు శ్రీనివాస రావు బెయిల్ రద్దు చేయించి మళ్లీ రిమాండు కు తీసుకున్నారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు సెంట్రల్ జైలులోనే రిమాండు ఖైదీగా ఉన్నాడు. దీంతో శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు, సోదరుడు సుబ్బరాజు అప్పట్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా శ్రీనివాసరావుకు బెయిల్ రాకపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వృద్ధాప్యంలో ఉన్నామని, కుమారుడు నాలుగు ఏళ్లుగా జైలులో మగ్గిపోతున్నాడని వాపోయారు. తమను చూసేవారు లేరని, తమ కుమారుడికి ఏం జరుగుతుందోనని చాలా భయపడిపోతున్నారు. తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బ రాజులు సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి శ్రీనివాస రావును కలిసి, నిరాహార దీక్ష ఎక్కడ చేపట్టేది నిర్ణయించుకోనున్నట్టు సోదరుడు సుబ్బరాజు తెలిపారు.
అందుకే దాడి చేశానంటూ శ్రీనివాసరావు వాంగ్మూలం..
ఎయిర్ పోర్టులో జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన తర్వాత జనపల్లి శ్రీనివాసరావు, తాను దాడి చేస్తే జగన్‌పై ప్రజల్లో సానుభూతి వస్తుందని దాని వల్ల భారీ విజయంతో గెలుస్తారని ఆ దాడి చేసినట్లుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్తీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఎన్‌ఐఏతో విచారణకు ఆదేశాలు తెచ్చారు. ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి కనిపించ లేదు. ఈ కారణంగా జనపల్లి శ్రీనివాస రావు ఇంకా జైల్లో ఉన్నారు. ఆయన పేరు కోడి కత్తి శ్రీనుగా ప్రచారంలోకి వచ్చింది.