Kuchipudi Baburao: తెలుగు వ్యక్తికి ఫ్రాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ - రిటైర్డ్ డీజీపీని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
Retired DGP Baburao: ఫ్రాన్స్ యూనివర్శిటీ ప్రముఖ డాక్టరేట్ ను తెలుగు వ్యక్తి, రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబూరావు ఇటీవల అందుకున్నారు. ఐపీఎస్ గా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు.
France University Doctorate to Retired Dgp Baburao: తెలుగు జాతి రత్నం, రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబూరావుకు (Kuchipudi Baburao) ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (France Doctorate) అందించింది. భారతదేశంలో ఎంతో మంది ప్రముఖులకు అందించిన ఈ అవార్డు ఇప్పుడు బాబూరావును వరించింది. అంబేద్కర్ ఆశయాలతో పోలీస్ అధికారిగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన యూనివర్సిటీ భారత్ సమాన్ అవార్డుతో పాటు గౌరవ డాక్టరేట్ ను ఈ నెల 12న దుబాయ్ వేదికగా ప్రధానం చేసింది. మధ్యప్రదేశ్ కేడర్ లో ఐపీఎస్ అయి దళిత జాతి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి అడిషనల్ డీజీపీ హోదాలో ఎంతోమందికి సేవ చేసిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనీయం.
కుటుంబ నేపథ్యం ఇదే
గుంటూరు (Guntur) జిల్లా అమృతలూరు (Amruthaluru) మండలం పెదపూడి గ్రామంలో శ్రీ కూచిపూడి ప్రకాశం, అనంతమ్మ దంపతలుకు జన్మించారు బాబూరావు. ఆయన తల్లిదండ్రుల ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేశారు. ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసి.. 1980లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవోగా పని చేశారు. 1991లో ఆయన ఐపీఎస్ కు మధ్యప్రదేశ్ కేడర్ లో ఎంపికయ్యారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిగా అనేక హోదాల్లో పని చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. 36 ఏళ్ల పాటు పోలీస్ అధికారిగా మచ్చలేని వ్యక్తిగా పేరొందారు. అక్కడ కరడుగట్టిన క్రిమినల్స్ లో నేర స్వభావాన్ని మార్చడానికి తన వంతుగా ప్రయత్నించారు. వివిధ నేరాల్లో చిక్కుకుని జైలు పాలైన నేరస్థుల కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. కుటుంబ పెద్ద నేరం చేసి జైలు కెళ్తే, మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే వారిని అనేక రకాలుగా ఆదుకున్నారు. నేరస్థుల పిల్లల్ని చదివించడమే కాకుండా వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహించారు. అడిషనల్ డీజీపీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు.
ఆ సేవలకు పురస్కారం
ప్రజాసేవలో కూచిపూడి బాబూరావు సేవా ధృక్పథం, తపనను గుర్తించిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డీ సోర్బన్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయాలని నిర్ణయించింది. భారతదేశం నుంచి ఈ భారత్ సమ్మాన్ అవార్డ్, గౌరవ డాక్టరేట్ ను ఇంతకు ముందు అనేక మంది ప్రముఖులు అందుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి డాక్టర్ మీనాక్షిలేఖి, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసిన పద్మభూషణ్ డాక్టర్ రామ్ సుతార్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్, సినీ నటుడు డాక్టర్ అంజన్ శ్రీవాస్తవ్, బాలీవుడ్ నటుడు సోనూసూద్, కాంగో రక్షణ మంత్రి డాక్టర్ సిల్వైన్ ముటోమ్ డో, దుబాయ్ ఫార్మసీ మంత్రి డాక్టర్ అలీ అల్ సయ్యద్ హుస్సేన్, ఇండియన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ లాంటి ఎంతో మంది ప్రముఖులు ఈ ఆవార్డు అందుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో బాబూరావు చేరి అందరికీ గర్వ కారణంగా నిలిచారు.
Also Read: TDP Janasena : ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు - మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ !