Rajat Bhargav : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు- కుంభకోణంలో మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్‌కు నోటీసులు
Rajat Bhargav : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అధికారుల పాత్ర ఉన్నట్టు సిట్ తేల్చింది. దీంతో మాజీ ఐఏఎస్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Rajat Bhargav : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఇందులో వైసీపీ నేతలు, వారి మద్దతుదారులైన వ్యాపారుల పాత్ర మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఓ మాజీ ఐఏఎస్ అధికారి పేరు వెలుగులోకి రావడం అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల తర్వాత స్టెప్ ఏమై ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.
వైసీపీ ప్రభుత్వం హాయంలో లిక్కర్ పేరుతో 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకూ ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిట్ విచారణలో స్పష్టమైందని తెలుస్తోంది.
మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడినా రజత్ భార్గవ్ పట్టించుకోలేదని సిట్ భావిస్తోంది. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి(ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ రజత్ భార్గవ్ దారుణంగా వ్యవహరించారని సిట్ తేల్చింది.
రజత్ భార్గవ్ కొన్ని నెలల క్రితమే పదవీ విరమణ చేశారు. ఇందులో ఆయన పాత్ర తేలడంతో సిట్ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది?డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎందుకు ఎలా ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి విషయంలో మౌనంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది. ధరల నియంత్రణ లేకపోవడానికి ప్రధాన కారణమేంటి? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనపై ఆయన్ని అధికారులు ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సత్య ప్రసాద్ అనే ఒక ఎక్సైజ్ అధికారికి మొత్తం బాధ్యతలు అప్పగించమని చెప్పింది ఎవరు ? ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వరాదన్న రూల్ కొన్ని కంపీనలకే ఎందుకు పాటించలేదనే విషయంపై కూడాప్రశ్నించనున్నారు.





















