AP Investments : కడపకు పెట్టుబడుల వరద - ఒకే సారి రూ.23,985 కోట్లతో పరిశ్రమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !
కడపలో మూడు భారీ పరిశ్రమల పెట్టుబడులకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. స్టీల్ ప్లాంట్ తో పాటు అదానీ, షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి.
AP Investments : కడపలో స్టీల్ ప్లాంట్ సహా మొత్తం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.కడప జిల్లాలో రూ. 8,800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అంగీకారం తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు కూడ ఆమోదం లభించింది. వీటి పెట్టుబడితో కలిసి రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ అంగీకారం తెలిపిందని సీఎంవో ప్రకటించింది.
కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్
కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడులు వస్తాయి.మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి,మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు. మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు ఈ ప్లాంట్ నుంచి బయటకు రానున్నాయి. త్వరలో ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్ాయి. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అదికారులకు సూచించారు.వెనకబడ్డ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని జగన్ అభిప్రాయపడ్డారు.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని,స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం
1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ అంగీకారం తెలిపింది.రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సంస్ద ద్వార ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి లభిస్తుందని, జగన్ అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్ ను 2024 డిసెంబర్లో ప్రారంభించి… నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామని వెల్లడించారు. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ. 8,855 కోట్ల పెట్టుబడి
షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే సంస్థ కూడా రూ. 8,855 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెట్టింది. ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ . ఈ కంపెనీ 2100 మెగావాట్ల ఉత్పత్తి చేస్తుందని.. ,ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే ఏడాది జులైలో ప్రారంభించి, విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ వివరించారు. దీని వలన ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు.