Mega Fans Meeting: చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కీలక సమావేశం - ఎందుకంటే
Vijayawada: ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించారు.
Chiranjeevi, Pawan Kalyan, Ram charan Fans Meeting in Vijayawada: విజయవాడలో చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram charan) అభిమానులు సమావేశం అయ్యారు. నగరంలోని మురళీ ఫార్చున్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ.. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో నడుస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 2024లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను సీఎంను చేయడమే తమ లక్ష్యమని అన్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చేలా ప్రణాళిక బద్దంగా పని చేస్తామని చెప్పారు.
ఇందుకోసం మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామని, అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని తెలిపారు. మెగా కుటుంబంలో అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని స్పష్టం చేశారు. తాము కూడా జనసేన పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని చెప్పారు. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తారని చెప్పారు.
ఇక పార్టీ పెట్టుకొనే పొత్తుల అంశం తమ పరిధిలోనిది కాదని అన్నారు. అదంతా పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని అన్నారు. గతంలో ప్రజారాజ్యంపై (Prajarajyam) అనేక కుట్రలు చేశారని, తాము ఆనాడు కుటుంబాలు వదిలి చిరంజీవి కోసం పని చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జనసేనపై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం కోసం పని చేస్తామని స్వామి నాయుడు వెల్లడించారు. రాజకీయంగా పూర్తి వివరాలను అనంతరం చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు ప్రకటిస్తారని ఆయన తెలిపారు.